న్యూఢిల్లీ: జీఎస్‌టీ వచ్చాక బిజినెస్ చేసుకోవడం మరింత ఈజీగా మారిందని దేశంలోని మెజార్టీ బిజినెస్ లీడర్లు చెబుతున్నారు. దేశంలో ట్యాక్స్ అడ్డంకులు తగ్గాయని డెలాయిట్ సర్వేలో పాల్గొన్న 90% మంది రెస్పాండెంట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా జీఎస్‌టీ వలన కన్జూమర్లకు కూడా మేలు జరుగుతోందని, ప్రొడక్ట్‌లు, సర్వీసుల ధరలపై జీఎస్‌టీ ప్రభావం పాజిటివ్‌గా ఉందని డెలాయిట్ జీఎస్‌టీ@5 సర్వే 2022 వెల్లడించింది. ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలలో ట్యాక్స్ సిస్టమ్‌లో ఆటోమేషన్ పెంచడం, ఈ–ఇన్వాయిసింగ్ లేదా ఈ–వే ఫెసిలిటీని తీసుకురావడం వంటివి ముందున్నాయని, ఈ సంస్కరణలు బిజినెస్‌లకు ఎక్కువ ఉపయోగకరంగా ఉన్నాయని డెలాయిట్ పేర్కొంది. ఈ సర్వే ప్రకారం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను పెంచడానికి ట్యాక్స్ సిస్టమ్‌ను సింపుల్‌గా మార్చాలని, మంత్లీ, యాన్యువల్ రిటర్న్‌ల ఆటో పాపులేషన్ (డేటాను స్టోర్ చేయడం) టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేయాలని ఇండస్ట్రీ లీడర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా, లోకల్‌గా వేసే 17 ట్యాక్స్‌లు అంటే ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్‌లను, 13 రకాల సెస్‌లను జీఎస్‌టీ కిందకు ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2017, జులై 1 నుంచి జీఎస్‌టీ విధానం అమలవుతోంది. జీఎస్‌టీ సక్సెస్ అయ్యిందనడానికి నిదర్శనం పెరుగుతున్న జీఎస్‌టీ కలెక్షనేనని డెలాయిట్ యుష్ తోమాషు పార్టనర్ మహేష్ జైసింగ్ అన్నారు. ట్యాక్స్ పేయర్లకు జీఎస్‌టీ విధానం ఫ్రెండ్లీగా ఉందని అభిప్రాయపడ్డారు.
జీఎస్‌టీ శ్లాబ్‌లపై జీఓఎం మీటింగ్..
జీఎస్‌టీ ట్యాక్స్ శ్లాబ్‌లను రేషనలైజేషన్ (మెరుగు పరచడం) చేయడంపై ఇప్పటికే రిపోర్ట్ అందించిన మినిస్టర్ల గ్రూప్ (జీఓఎం) శుక్రవారం (జూన్ 17 న) సమావేశం కానుంది. ట్యాక్స్ శ్లాబ్‌లను మార్చడంపై చర్చించనుంది. ప్రస్తుత పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకొని ఫైనల్ రిపోర్ట్‌ను మినిస్టర్ల గ్రూప్ ఇవ్వనుంది. ఇందుకోసం మరి కొంత టైమ్ పడుతుందని అంచనా. ఇన్‌ఫ్లేషన్ రికార్డ్ లెవెల్స్ చేరుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, జీఎస్‌టీ శ్లాబ్‌లను రేషనలైజేషన్ చేయడం కష్టమని జీఓఎం భావిస్తోందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు.