- స్టాక్ మార్కెట్లో అధిక లాభాలంటూ సైబర్ కేటుగాళ్ల మోసం
బషీర్ బాగ్, వెలుగు: స్టాక్ మార్కెట్లో అధిక లాభాల పేరిట ఓ వ్యక్తికి సైబర్ కేటుగాళ్లు రూ.28 లక్షల కుచ్చుటోపీ పెట్టారు. సిటీకి చెందిన 45 ఏళ్ల బిజినెస్ మెన్ నంబర్‌కు తొలుత స్టాక్స్, ఐపీవోలకు సంబంధించి సలహాలు , సూచనలు ఇస్తామని ఏబీఎంఎల్ పేరుతో మెసేజ్ వచ్చింది. తాము చెప్పిన కంపెనీలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలికారు. దీంతో బాధితుడు తొలుత చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టగా, సైబర్ కేటుగాళ్లు అకౌంట్లో రెట్టింపు లాభాలు చూపించారు.
అనంతరం బాధితుడు రూ.28.50 లక్షలను విడతల వారీగా పెట్టుబడి పెట్టగా, అకౌంట్లో రూ.61.66 లక్షల లాభాలు చూపించారు. ఇంకా డబ్బులు పెట్టుబడి పెట్టాలని, లేదంటే అకౌంట్ ఫ్రీజ్ అవుతుందని స్కామర్లు బుకాయించారు. స్టాక్స్‌ను బాధితుడు అతని భార్యకు కేటాయించినట్లు ఆరోపించారు. ఇలా చేయడం రూల్స్‌కు విరుద్ధమని, కేసులు కూడా నమోదు అవుతాయని హెచ్చరించారు. స్కామర్ల మాటల పట్ల అనుమానం కలిగిన బాధితుడు సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.
డెలివరీ అడ్రెస్ అప్డేట్ పేరిట రూ.1.55 లక్షలు
డెలివరీ అడ్రెస్ అప్డేట్ పేరిట ఓ ప్రైవేటు ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు మోసగించారు. నగరానికి చెందిన 35 ఏళ్ల వ్యక్తికి డెలివరీ అడ్రెస్‌ను 12 గంటల్లో అప్డేట్ చేసుకోవాలని, లేకపోతే బుక్‌చేసిన ప్రొడక్ట్ రిటర్న్ అవుతుందని మెసేజ్ వచ్చింది. దీంతో సదరు లింక్ క్లిక్ చేసి ఐసీఐసీఐ క్రెడిట్‌కార్డుతో రూ.25 చెల్లించి అడ్రెస్ అప్డేట్ చేశాడు. అనంతరం అతని క్రెడిట్ కార్డు నుంచి 6505 ధీరమ్స్ (రూ.1.55 లక్షలు) వాడినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో బాధితుడు వెంటనే కార్డును బ్లాక్ చేసి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.