కట్టడి లేని కల్తీ..జోరుగా సాగుతున్న కల్తీ వ్యాపారం 

  •     ఆరు నెలలుగా సెలవులో ఫుడ్ ఇన్​స్పెక్టర్​
  •     ఒక్క అటెండర్ కు మూడు జిల్లాల బాధ్యతలు
  •     అడ్డగోలుగా కల్తీ చేస్తున్నా అధికారులు పట్టించుకోని వైనం

సూర్యాపేట, వెలుగు :  సూర్యాపేట జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల వ్యాపారం జోరుగా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ వ్యాపారంపై అధికారులు ఉక్కుపాదం మోపుతుండగా జిల్లాలో మాత్రం ఎవరూ పట్టించుకోకపోవడంతో కల్తీ వ్యాపారులకు అడ్డుఅదుపు లేకుండాపోయింది. జిల్లాలో ఇన్​చార్జి అధికారులు లేకపోవడంతో కల్తీ జరిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

సిబ్బంది కొరత.. 

ఆహార పదార్థాలను తనిఖీ చేయడానికి, నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించడానికి సరైన సిబ్బంది లేరు. జిల్లాలో పనిచేసే ఫుడ్‌‌‌‌ ఇన్​స్పెక్టర్ బదిలీపై వెళ్లగా, ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన ఫుడ్ ఇన్​స్పెక్టర్​ శీర్షిక డ్యూటీలో చేరిన మూడు రోజులకే సెలవుపై వెళ్లింది. ఆరు నెలలుగా ఆమె సెలవులో ఉండడంతో  ఇదే అదునుగా భావించి కల్తీ రాయుళ్లు పెట్రేగిపోతున్నారు. ఫుడ్ ఇన్​స్పెక్టర్​తోపాటు వైద్యారోగ్యశాఖలో పనిచేసే వైద్యాధికారికి గెజిటెడ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గా అదనపు బాధ్యతలు అప్పగించినా ఎక్కడ కూడా తనిఖీ చేసిన దాఖలాలు లేవు. ఉన్న ఒక్క అటెండర్ సైతం మూడు జిల్లాల్లో బాధ్యతలు నిర్వహిస్తుండడంతో కనీసం ఆఫీస్ తాళం తీసేవారే కరువయ్యారు. 

ఇష్టానుసారంగా కల్తీ..  

జిల్లాలో ఇష్టానుసారంగా వ్యాపారులు కల్తీలకు పాల్పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. నెయ్యి, వంట నూనెలు, మసాలాలు, సోంపు గింజలు, అల్లం వెల్లుల్లి, పసుపు, కారం తదితర ఆహార పదార్థాలను అనుమతి లేకుండా ప్యాకింగ్‌‌‌‌చేసి మార్కెట్‌‌‌‌లోకి వదులుతున్నారు. చిన్నచిన్న ప్యాకెట్లగా తయారు చేసి రూ.5, రూ.10 పేద, మధ్యతరగతి ప్రజలకు విక్రయిస్తున్నారు. రిటైల్‌‌‌‌షాపు నిర్వాహకులకు కూడా అధిక శాతం లాభం ఉండడంతో వారు వినియోగదారులకు కల్తీ ఆహార పదార్థాలనే అంటగడుతున్నారు. వీటితో పాటు రెస్టారెంట్, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, బేకరీల్లో పెద్ద ఎత్తున కల్తీ పదార్థాలు అమ్ముతున్నారని ఆరోపణలు ఉన్నాయి. 

లైసెన్స్‌‌‌‌ లేకుండానే తయారీ.. 

ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాలు పర్యవేక్షించేందుకు ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏఐ (ఫుడ్‌‌‌‌సేఫ్టీ, స్టాండర్డ్స్‌‌‌‌అథారిటీ ఆఫ్‌‌‌‌ ఇండియా) భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎలాంటి ఆహార పదార్థాలను ఉత్పత్తి, మార్కెటింగ్‌‌‌‌ చేయాలన్న ఆ సంస్థ నుంచి లైసెన్స్‌‌‌‌ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆహార తయారీదారులు ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏఐ లైసెన్సులు లేకుండానే తయారు చేసి పదార్థాలను విక్రయిస్తున్నారు. వంట నూనెలు నియంత్రణ చట్టం 1947, నిత్యావసర సరుకుల చట్టం 1955, ఆహార కల్తీ నిరోధక చట్టం 1954, పాల ఉత్పత్తుల నియంత్రణ చట్టం 1992 తదితర చట్టాలు ఉన్నప్పటికీ కల్తీ పదార్థాలను అధికారులు అరికట్టలేకపోతున్నారు.