- ఆటో నంబర్ చూపి.. ఫోర్ వీలర్ బిల్లులు డ్రా
- ట్యాక్సీలకు వైట్ ప్లేట్ల వినియోగం
- ఆఫీసర్లు వాడేది ఒక వెహికల్.. రికార్డుల్లో మరొకటి
- దర్జాగా బిల్లుల చెల్లింపులు
ఈ ఫొటోలో కనిపిస్తున్న TS 11 UC 0809 నంబర్ ఆటో కరీంనగర్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ అఫిషీయల్ వెహికల్. రోజూ ఇంటి నుంచి ఆఫీసుకు, అక్కడి నుంచి సిటీలో జరిగే నిర్మాణాలను పరిశీలించడానికి వెళ్తుంటారు. ఆఫీసర్ ఆటోలో తిరగడమేంటి..? ఇంత నిరాండంబరంగా ఆటోల్లో తిరిగే ఆఫీసర్లు ఈరోజుల్లోనూ ఉన్నారా అంటే.. కార్పొరేషన్ హైర్ వెహికల్స్ రికార్డులు అవుననే చెబుతున్నాయి. ఎందుకంటే కరీంనగర్ కార్పొరేషన్ రికార్డుల ప్రకారం అసిస్టెంట్ సిటీ ప్లానర్ అద్దెకు తీసుకుని వాడుతున్న వెహికల్ నంబర్ ను చెక్ చేస్తే ఆటోగానే చూపిస్తోంది. ఈ ఆటో పేరిట కార్పొరేషన్ నుంచి నెలకు రూ.33 వేల అద్దె చెల్లిస్తున్నారు. వాస్తవానికి సదరు ఆఫీసర్ TS 02 FD 7679 నంబర్ గల వైట్ ప్లేట్ బొలేరే వెహికల్ ను వాడుతుంటే.. హైదరాబాద్ అంబర్ పేటకు చెందిన కె.నీలేశ్నాయక్ ఆటో నంబర్ పేరిట ప్రతీనెలా బిల్లులు ఎందుకు చెల్లిస్తున్నారో అంతుచిక్కడం లేదు.
కరీంనగర్/కరీంనగర్ టౌన్, వెలుగు:
కరీంనగర్ నగరపాలక సంస్థలో అద్దె కార్ల బిల్లుల చెల్లింపులో అక్రమాలు వెలుగు చూశాయి. ఒక అధికారికి అలాట్ అయిన త్రీవీలర్(ఆటో) రిజిస్ట్రేషన్ నంబర్ ను ఫోర్ వీలర్ నంబర్ గా చూపి బిల్లులు డ్రా చేయగా, రూల్స్ కు విరుద్ధంగా ఎల్లో ప్లేట్ వెహికల్స్ కు బదులు వైట్ ప్లేట్ ఉన్న వాహనాలను కార్పొరేషన్ అధికారులు అద్దెకు తీసుకోవడం వివాదాస్పదంగా మారింది. కొందరు అధికారులకు రికార్డుల్లో అలాట్ చేసిన హైర్ వెహికల్ ఒకటైతే.. వేరొకటి వాడుతున్నారు. కార్పొరేషన్ లో మొత్తం 21 కార్లను అద్దెకు తీసుకున్నట్లు రికార్డులు వెల్లడిస్తుండగా ఇందులో మెజార్టీ వెహికల్స్ ను ఆఫీసర్లు వాడడం లేదు. దీంతో ఈ వాహనాల పేరిట డ్రా చేస్తున్న బిల్లులు ఎవరి అకౌంట్లకు వెళ్తున్నాయో తెలియడం లేదు. ఇటీవల కరీంనగర్ పట్టణానికి చెందిన బండి శ్రీనివాస్ అనే ఆర్టీఐ యాక్టివిస్టు ఆర్టీఐ కింద సమాచారం తీసుకోగా ఈ వ్యవహారం వెలుగు చూసింది.
రిజిస్టర్ లో ఒకటి.. వాడేది ఇంకోటి..
l మునిసిపల్ కమిషనర్ TS 22 T 1239 నంబర్ గల బ్లాక్ కలర్ ఇన్నోవా కారు అద్దెకు తీసుకున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ ఇన్నోవా వైట్ నంబర్ ప్లేట్ కలిగి ఉంది. వాస్తవానికి కమిషనర్ తనకు అలాట్ అయిన ఈ వెహికల్ కాకుండా నంబర్ ప్లేట్ లేని వేరొక ఇన్నోవా కారును వినియోగిస్తున్నారు. l ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఈఈ)కి TS 02 UC 1220 వాహనం అలాట్ అయితే TS 15 UD 3349 వాహనాన్ని వాడుతున్నారు. l డిప్యూటీ కమిషనర్ కు TS02 UC 3675 నంబర్ కారు అలాట్ కాగా ఆయన TS 02 EX 9567 వైట్ నంబర్ ప్లేట్ గల వాహనాన్ని వినియోగిస్తున్నారు. ఇవేగాక మేయర్, డిప్యూటీ మేయర్ వినియోగిస్తున్న వెహికల్స్ కు ఒకటైతే.. అలాట్ అయిన నంబర్లు వేరే కావడం అనుమానాలకు తావిస్తోంది. ఫిట్ నెస్ లేని వెహికల్స్ వాడుతున్నట్లు తెలుస్తుంది.
ఏడాదికి రూ.83లక్షలు..
కార్పొరేషన్ అధికారులు ఒక్కో అద్దె వాహనానికి నెలకు రూ.33 వేలు చెల్లిస్తున్నారు. ఇలా 21 వెహికల్స్ కు నెలకు రూ.6.93 లక్షలు ఏడాదికి రూ.83.13 లక్షలు అద్దె చెల్లిస్తున్నారు. వీటిలో సాయి తిరుమల టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి 10 వెహికల్స్ ఉన్నాయి. టీఎస్ 11 యూసీ 0809 నంబర్ గల ఆటో ఇదే ట్రావెల్స్ నుంచి అద్దెకు పెట్టారు. శ్రీవిఘ్నేశ్వర ట్రావెల్స్, నర్సింహా ట్రావెల్స్, కృష్ణ ట్రావెల్స్, స్నేహ ట్రావెల్స్ నుంచి రెండు వెహికల్స్ చొప్పున, రేణుక ట్రావెల్స్, సాయి విఘ్నేశ్వర ట్రావెల్స్, గంగా ట్రాక్టర్స్ అండ్ వాటర్ ట్యాంకర్స్ నుంచి ఒక్కో వెహికల్స్ చొప్పున ఉన్నాయి.
రూల్స్ ఏం చెబుతున్నాయంటే..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎల్లో ప్లేట్ ఉన్న టాక్సీ వాహనాలను మాత్రమే గవర్నమెంట్ ఆఫీసుల్లో అద్దెకు తీసుకోవాలి. ఆ వాహనాలకు పొల్యూషన్, ఇన్సూరెన్స్, ఫిటినెస్ సర్టిఫికెట్లతో పాటు టాక్స్ అప్రూవల్, డ్రైవర్ కు ప్రొఫెషనల్ డ్రైవింగ్ లైసెన్స్ విత్ బ్యాడ్జీ విధిగా ఉండాలి. 6 నెలలకు ఓసారి సమీక్షించాలి. కానీ కరీంనగర్ కార్పొరేషన్ లో రూల్స్ కు విరుద్ధంగా వెహికల్స్ ను అద్దెకు తీసుకోవడం, బిల్లులు చెల్లిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై సామాజిక కార్యకర్త బండి శ్రీనివాస్ ఆర్టీఐ సమాచారంతో కమిషనర్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం.