![కుందేళ్లతో వ్యాపారం](https://static.v6velugu.com/uploads/2022/06/Business-with-rabbits_Nanda-Surya-Prakash-Lankipalli_EQ8ogSy9Iw.jpg)
లక్షల్లో జీతం వచ్చే జాబ్ ఉంటే చాలు.. హాయిగా బతికేయొచ్చు. అంతకుమించి కావాల్సింది ఏముంది అనిపిస్తుంది. అదొక్కటే కాదు.. దాంతో పాటు మనసుకి నచ్చిన పని కూడా చేస్తే లభించే తృప్తి వేరు అనేవాళ్లూ ఉన్నారు. ఆ కోవకే చెందుతుంది నంద సూర్యప్రకాశ్. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఈమెకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. కుందేళ్లని పెంచడం అంటే అంతకుమించి ఇష్టం. ఆ ఇష్టమే ఏకంగా కుందేళ్ల కోసం ఒక ఫామ్ పెట్టేలా చేసింది.
“కరోనా టైమ్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు కుందేళ్లు పెంచాలనే ఆలోచన వచ్చింది. దానికి తోడు ఆరోగ్య సమస్యలు ఉన్న మా బంధువుల్లో కొందరు హెల్దీమీట్ దొరకడం లేదని అనేవాళ్లు. దాంతో, ఏ మాంసం మంచిదో తెలుసుకునేందుకు రీసెర్చ్ చేశా. వైట్‌మీట్ అయిన కుందేలు మాంసం మంచిదని చదివా. అదే విషయం డైటీషియన్లు, న్యూట్రిషనిస్ట్‌లు అయిన నా ఫ్రెండ్స్, బంధువుల్ని కూడా అడిగా. వాళ్లు కూడా ‘కుందేలు మాంసం ఆరోగ్యానికి మంచిద’ని చెప్పారు. దాంతో, అందరికీ హెల్దీమీట్ అనే కాన్సెప్ట్‌తో కుందేళ్లు పెంచాలనుకున్నా.
రెండున్నర లక్షలు పెట్టి...
పోయిన ఏడాది నవంబర్‌లో తెనాలి నుంచి పది యూనిట్ల కుందేళ్లు (ఒక యూనిట్ పది కుందేళ్లు) తీసుకొచ్చా. ఒక్కో యూనిట్లో నాలుగు లేదా మూడు మగ కుందేళ్లు ఉంటాయి. ఒక యూనిట్ ధర రూ.25,000. పది యూనిట్లకి రెండున్నర లక్షలు ఖర్చయ్యాయి. వాటిని పెంచడం కోసం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని కానుకుంట ఊరికి దగ్గర్లో ఒక షెడ్డుని లీజుకు తీసుకున్నా. కుందేళ్ల పెంపకానికి తగ్గట్టుగా ఇనుప కేజ్‌లు ఏర్పాటు చేశాను. ఒక కేజ్ 2/2 సైజ్‌లో ఉంటుంది. అంటే... 4 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు. కుందేళ్ల ప్రెగ్నెన్సీ పీరియడ్ 28 నుంచి 30 రోజులు. క్రాస్ చేసిన నెల రోజులకి పిల్లల్ని (బన్నీస్) పెడతాయి. ఒక కాన్పులో రెండు నుంచి పన్నెండు పిల్లల్ని పెడతాయి. ఇప్పుడు మా ఫామ్‌లో పిల్లలు, పెద్దవి కలిపి ఐదొందల కుందేళ్లు ఉన్నాయి. మా అమ్మపేరు భువనేశ్వరి. అందుకని మా ర్యాబిట్ ఫామ్‌కి ‘భువన ర్యాబిట్ ఫామ్’ అని పేరు పెట్టా. ఆస్తి పేపర్లు, ఇతర కాగితాలు... ఇలా అన్నింటి మీద నాన్న పేరే ఉండేది. అందుకనే నా ఫామ్‌కి అమ్మ పేరు పెట్టుకున్నా.
తొమ్మిది రకాల బ్రీడర్స్
మా ఫామ్‌లో అంగోరా, న్యూజిలాండ్ వైట్, చించిల్లా, కాలిఫోర్నియా, డచ్, ఇంగ్లీషు స్పాట్, సిన్నమిన్, బ్లాక్ జెయింట్, ఫ్లెమిష్ జెయింట్.. అనే తొమ్మిది రకాల కుందేళ్లు పెంచుతున్నా. మక్కపిండి, పల్లిచెక్క, మినరల్స్ ఉన్న డ్రై ఫీడ్ ఇస్తున్నా. వీటికి మేతగా వేసే నేపియర్ గడ్డిని ఫామ్‌లోనే పెంచుతున్నా. రోజుకు రెండుసార్లు... పొద్దున పది గంటలకు, సాయంత్రం నాలుగ్గంటలకు గడ్డి వేస్తాం. ఈ గడ్డిలో సూపర్, స్మార్ట్, ఆల్ఫా ఆల్ఫా, హెడ్జ్ల్యూసెన్ అని నాలుగు రకాలు ఉంటాయి. నిపుల్ సిస్టం ద్వారా నీళ్లు పెడుతున్నా. కుందేళ్లు 45 రోజుల్లో కిలోన్నర బరువు వరకు పెరుగుతాయి. వీటి కూర నారనారగా, ముదిరినట్టు ఉండదు. అంతేకాదు రెడ్‌మీట్, చికెన్, మటన్‌లో లాగా కుందేలు మాంసంలో కొవ్వు, కొలెస్ట్రాల్ ఉండవు. ఇది వైట్‌మీట్ కాబట్టి దీన్ని పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ తినొచ్చు. త్వరగా అరుగుతుంది కూడా. ఇందులో ఐరన్, ఒమెగా–3–ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. గుండెజబ్బులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు కూడా ఎంచక్కా కుందేలు మాంసం తినొచ్చని డాక్టర్లు చెప్తున్నారు.
మార్కెట్ కంటే తక్కువకే
బయట రూ.850 నుంచి 900 రూపాయ లకు కుందేలు మాంసం దొరుకుతోంది. నేను మాత్రం రూ.800 లకు కిలో అమ్ముతున్నా. లైవ్ ర్యాబిట్ అయితే రూ.700. ఒక యూనిట్ బ్రీడర్స్ని 12 నుంచి 15 వేల రూపాయలకు ఇస్తున్నా. రెండు బన్నీస్ కావాలంటే వెయ్యి నుంచి పన్నెండొందలు. హోటళ్లు, రెస్టారెంట్ల వాళ్లతో అగ్రిమెంట్ చేసుకోవాలి అనుకుంటున్నా. కుందేళ్లని ల్యాబొరేటరీస్‌కు కూడా ఇవ్వాలనే ఆలోచన ఉంది. ఇప్పటివరకైతే మాంసం, బన్నీస్ అమ్మి నెలకు దాదాపు లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నా. పెట్టుబడి, కూలీల ఖర్చులు పోను రూ.50 వేలు మిగులుతున్నాయి.
బెస్ట్ సీజన్
కొత్తగా కుందేళ్లు పెంచాలనుకునే వాళ్లు చలికాలం లో కుందేళ్ల పెంపకం చేపడితే బాగుంటుంది. ఎండ తక్కువ కాబట్టి పుట్టిన కుందేలు పిల్లలు(బన్నీస్) చనిపోయే అవకాశం తక్కువ. వాటిని క్రాస్ చేసిన రోజు, డెలివరీ అయ్యే టైంని నోట్ చేసుకోవాలి. షెడ్డు శుభ్రంగా ఉంటే కుందేళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఎప్పటికప్పుడు వాటి మలాన్ని ఎత్తిపోసి, శుభ్రం చేస్తుండాలి. ఇది ఎరువుగా కూడా పనికొస్తుంది. చల్లదనం కోసం షెడ్డు మీద గడ్డి వేయాలి. ఫాగర్స్, కూలర్స్ లేదంటే సర్క్యులేటెడ్ ఫ్యాన్స్ పెట్టాలి. వీటికి పళ్లు పెరుగుతుంటాయి. వాటిని గమనించి కత్తిరించకపోతే గడ్డి తినడం కష్టమవుతుంది.
ఫ్యామిలీ సపోర్ట్‌తో...
కుందేళ్లు పెంచుతానని అమ్మానాన్న, ఫ్రెండ్స్‌తో చెప్తే ఎంకరేజ్ చేశారు. వాళ్ల సపోర్ట్‌తో ఇదంతా చేయగలుగుతున్నా. మొదట్లో పనివాళ్లు దొరక్కపోవడంతో నేనే అన్ని పనులు చేసుకున్నా. ఇప్పుడు ఇద్దరు పనివాళ్లు ఉన్నారు. కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో ఇక్కడే ఆఫీసు పనిచేసేదాన్ని. ఇప్పుడు రెగ్యులర్‌గా ఆఫీస్‌కి వెళ్తున్నా. వీకెండ్లో ఇక్కడికి వస్తా’’ అని చెప్పింది నంద సూర్యప్రకాశ్ లంకిపల్లి .
బన్నీస్ బతకాలంటే...
కొన్ని తల్లి కుందేళ్లు అప్పుడే పుట్టిన పిల్లల్ని గాయపరుస్తాయి. కొన్నయితే వాటిని తింటాయి కూడా. అందుకని గర్భంతో ఉన్న కుందేళ్లని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. అవి తమ వెంట్రుకలతో గూడు చేస్తున్నా యంటే పిల్లల్ని బాగా చూసుకుంటాయని అర్థం. ఒకవేళ అవి డల్‌గా ఉన్నాయంటే పుట్టిన పిల్లల్ని వాటి నుంచి వేరుచేసి, గోనె సంచిలో పెట్టాలి. రోజుకు రెండుసార్లు తల్లిని తీసుకెళ్లి పాలు తాగించాలి. ఒక నెల తర్వాత వాటిని తల్లి ఉన్న కేజ్‌లో వదిలేయాలి.
అదే నా డ్రీమ్
మాది తిరుపతి దగ్గర్లోని పాకాల. అమ్మానాన్న, అక్క, నేను... ఇది మా ఫ్యామిలీ. ఎంబీఏ చదివాక జాబ్ కోసం 2005లో హైదరాబాద్ వచ్చా. ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌లో జాబ్ చేస్తున్నా. నా చిన్నప్పుడు కుందేలు కూర తినేదాన్ని. కుందేలు మాంసం ఆరోగ్యానికి మంచిదని తెలిశాక ఎక్కువగా తినేదాన్ని. అయితే, ముద్దుగా ఉండే కుందేళ్లని తినాలంటే మనసొప్పదు చాలామందికి. కానీ, వాటి మాంసం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకని వైట్‌మీట్ అమ్మడం అనేది నా ఫస్ట్ ఛాయిస్. ఇదేకాకుండా... బాతులు, టర్కీకోళ్లు, కడక్‌నాథ్ కోళ్లతో పాటు కొన్ని ఆవులు, లేగదూడల్ని పెంచాలనే ఆలోచన కూడా ఉంది. నా ఫామ్‌ని మినీ జూ చేయాలనేది నా డ్రీమ్. ఇక్కడికి వచ్చే చిన్నపిల్లలకు రకరకాల జంతువులు, వాటి పెంపకం గురించి చెప్పాలనుకుంటున్నా.
::: సంతోష్ బొందుగుల,
సురేష్ రెడ్డి దుబ్బాక