కేరళకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మనూర్ ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే బాబీ ప్రముఖ స్టార్ హీరోయిన్ హానీ రోజ్ పై పలు ఇంటర్వూలలో అసభ్యకరంగా మాట్లాడటం, లైంగిక వేధింపులకు పాల్పడటం వంటివి చెయ్యడంతో కొచ్చి పోలీసులు బుధవారం వాయనాడ్‌లోని మెప్పాడిలోని అతని ఎస్టేట్‌లో అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అలాగే ఎర్నాకులం సెంట్రల్ పోలీసులు బాబీపై లైంగిక వ్యాఖ్యలు చేసినందుకు BNS సెక్షన్ 75(1)(4) కింద కేసు నమోదు చేశారు.
దీంతో బాబీ బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేసాడు. ఈ బెయిల్ పిటీషన్ ని గురువారం ఎర్నాకులం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్ట్-II పరిశీలించి బెయిల్ మంజూరు చెయ్యడానికి నిరాకరించింది. అంతేకాకుండా బాబీ ని 14 రోజులపాటూ రిమాండులో ఉంచి విచారించాలని పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది.
Also Read :- రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్
దాంతో బాబీ ఈసారి బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. అలాగే బాబీ తనకి బెయిల్ మంజూరు చెయ్యాలంటూ కేరళ హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేశాడు. ఈ బెయిల్ పిటీషన్ లో తనకి వ్యాపార లావాదేవీలు ఉన్నాయని కాబట్టి బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టుని కోరాడు. ఈ బెయిల్ పిటీషన్ ని శుక్రవారం హైకోర్టు పరిశిలించింది. ఈక్రమంలో బెయిల్ విచారణను జనవరి 14వ తేదీకి వాయిదా వేసింది. దీంతో బాబీ అప్పటివరకూ ఎర్నాకులం జైలులో 14 రోజులపాటూ రిమాండ్ లో ఉండనున్నాడు.