
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని రాజేంద్రనగర్కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త సామ దామోదర్ రెడ్డి ఆరోపించారు. వాట్సప్ కాల్స్ చేసి నిన్ను చంపేందుకు సుపారీ అందింది.. నిన్ను చంపుతామంటూ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు.
మంగళవారం (డిసెంబర్ 26) విలేకరుల సమావేశంలో మాట్లాడిన సామ దామోదర్ రెడ్డి తన గోడును వెల్లబోసుకున్నారు. గుర్తు తెలియని వాట్సప్ నెంబరు నుంచి కాల్స్ వస్తున్నాయని.. లిఫ్ట్ చేస్తే హిందీలో మాట్లాడుతున్నారని తెలిపారు.
నిన్ను చంపడానికి రూ. 50 లక్షల సుపారి అందిందని త్వరలోనే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రోజు నీ ఇంటి చుట్టు తిరుగుతున్నాం.. నిన్ను అబ్జర్వ్ చేస్తున్నామని భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. దీని వెనక ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సూత్రధారి అని చెప్పారు.
గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాను..అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో పట్టించుకోలేదని వ్యాపార వేత్త సామ దామోదర్ రెడ్డి అన్నారు. ఇప్పటికైనా తనకు న్యాయం జరిగేలా చూడాలని వ్యాపార వేత్త సామ దామోదర్ రెడ్డి కోరారు.