ఆర్మూర్​లో రూ.5 కోట్లు అప్పు చేసి ఉడాయించిన వ్యాపారి

ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్ లో దాదాపు 20 మంది నుంచి రూ.5 కోట్ల వరకు అప్పు చేసిన ఓ వ్యాపారి వారం రోజుల కింద ఉడాయించాడు. అయిదేండ్ల క్రితం ఆర్మూర్​కు వలస వచ్చిన ఓ వ్యాపారి ఆర్.కె.కాంప్లెక్స్, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ సమీపంలో మొత్తం 9 మడిగెల్లో మెన్స్ వేర్, మొబైల్ షాప్​లు ఏర్పాటు చేశాడు. తెలిసిన వారితో పాటు దాదాపు ఇరవై మంది దగ్గర  చిట్టీలు వేసి ఎత్తుకున్నాడు. మరికొందరి దగ్గర ఫైనాన్స్​తీసుకున్నాడు. మొదట్లో రెగ్యులర్ గా వడ్డీలు కట్టడం, చిట్టీలు కూడా మిస్​చేయకుండా కట్టడంతో ఫైనాన్స్ వ్యాపారులు ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బులిచ్చారు.

ఇలా మొత్తం రూ.5 కోట్ల వరకు తీసుకున్నాడు. నెల రోజుల నుంచి డబ్బులు కట్టకపోవడంతో ఆరా తీయగా  వారం నుంచి కనిపించడం లేదని తెలిసింది. తెలిసిన వారికి నాలుగు దుకాణాలను అప్పగించి, మిగతా దుకాణాలకు తాళాలు వేసి వెళ్లిపోయినట్టు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఎవరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.