- ఐపీఎల్‌లో నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇదే: బట్లర్
కోల్‌కతా: ఈ ఐపీఎల్‌లో జోస్ బట్లర్ సూపర్ పెర్ఫామెన్స్ చేస్తున్నాడు. ఒంటి చేత్తో రాజస్తాన్ రాయల్స్‌కు విజయాలను అందిస్తున్నాడు. ముఖ్యంగా ఛేజింగ్‌లో బట్లర్‌కు ఎదురులేకుండా పోయింది. ఆర్‌సీబీతో మ్యాచ్‌లో సెంచరీతో టీమ్‌ను గెలిపించిన బట్లర్ తాజాగా కేకేఆర్‌పైనా వందతో రికార్డు టార్గెట్ ఛేజ్ చేసి రాయల్స్‌కు ఓటమి తప్పించాడు. మెగా లీగ్‌లో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ స్ఫూర్తితో ఇలాంటి పెర్ఫామెన్స్ చేస్తున్నానని బట్లర్ చెబుతున్నాడు. ‘నమ్మకమే ఈ రోజు నన్ను ముందుకు నడిపించింది.
స్టార్టింగ్‌లో రిథమ్ అందుకోలేక కొంచెం ఇబ్బంది పడ్డా. ఇలాంటి సందర్భాల్లో మనం అసహనానికి గురైతే మన సత్తాను మనం ప్రశ్నించుకున్నట్టే అవుతుంది. క్రీజులో ప్రశాంతంగా ఉండి ముందుకెళ్తే రిథమ్ వస్తుందని నాకు నేను చెప్పుకున్నా. ఐపీఎల్‌లో నేను చాలా ఆసక్తికర సంఘటనలు చూశా. ధోనీ, కోహ్లీ లాంటి వాళ్లు చివరి వరకు క్రీజులో ఉండేవాళ్లు. తమను తాము నమ్మేవాళ్లు.
నేను అదే ప్రయత్నం చేశా’ అని మ్యాచ్ అనంతరం బట్లర్ చెప్పుకొచ్చాడు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు తనకు సహకరించిన టీమ్ హెడ్ కోచ్ కుమార సంగక్కరకు బట్లర్ థ్యాంక్స్ చెప్పాడు. ‘ క్లిష్ట సమయాల్లోపోరాడకుండా వికెట్ వదులుకోవడం అనేది అత్యంత చెత్త విషయం అని సంగక్కర చెబుతుంటారు. క్రీజులోనే ఉండిపోతే ఏదో ఒక దశలో ఊపు మారుతుందని చెప్పారు’ అని బట్లర్ తెలిపాడు. ఇక, కేకేఆర్‌పై సెంచరీ ఐపీఎల్‌లో తన బెస్ట్ ఇన్నింగ్స్ అన్నాడు.