పువ్వుల మకరందం కోసం తిరిగే తేనెటీగలు భూమి నుంచి అదృశ్యమైన నాలుగేండ్లలో మానవజాతి అంతరిస్తుంది. ఓ సందర్భంలో ఆల్బర్ట్ ఐన్స్టీన్అన్న మాటలివి. పువ్వులు లేకుంటే తేనెటీగలు ఉండవు. కాయలు, పండ్లు, విత్తనాలకు మూలమైన ఆ పువ్వులు లేకుంటే మానవ జాతి మనుగడ కష్టమే అన్నది ఆయన మాటల సారాంశం. పువ్వులు కాయలుగా మారే పరాగ సంపర్కంలో, ఆహారపు గొలుసు, ఆవరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించే సీతాకోక చిలుకలు అంతరించిపోయే ప్రమాదం ఉన్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. సీతాకోకచిలుకల సంఖ్య, మెరుగైన పర్యావరణ పరిస్థితులకు సూచికలు. కాగా ఆవాస విధ్వంసం, వాతావరణ కాలుష్యం, విచ్చలవిడిగా పురుగు మందుల వాడకం, అటవీ నిర్మూలన, వాతావరణ మార్పుల కారణంగా అవి అంతరించిపోయే ప్రమాదం ఉందని ‘అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సంస్థ’, ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్(ఐయూసీఎన్)’ హెచ్చరిస్తున్నాయి. ఐయూసీఎన్ ఇప్పటికే 1,47,517 జాతులను రెడ్బుక్లిస్టులో చేర్చగా, అందులో 41,459 జాతులు అంతరించిపోయే దశలో ఉన్నట్లు పేర్కొంది.
పంటల ఉత్పత్తిలో కీలకం
జువాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం దేశంలో1,318 జాతుల సీతాకోక చిలుకలు ఉండగా, వాటిలో 43 జాతులు అంతరించబోతున్నాయని ఐయూసీఎన్ తెలిపింది. అందులో మూడు రకాల జాతులు తక్కువ ఆందోళనలో ఉన్న జాతులుగా వర్గీకరించింది. మోనార్క్ బటర్ ఫ్లై, టైగర్ హాప్పర్, బ్లాక్ ప్రిన్స్, గ్రేట్ఎల్లో సేలర్, ఫారెస్ట్ హాఫర్, స్క్వేర్ వాల్ వంటి సీతాకోకచిలుక జాతులు అదృశ్యమైనట్లు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటికే పేర్కొంది. ఆపిల్ నుంచి కాఫీ వరకు అనేక ఆహార పంటలు పరాగ సంపర్కానికి సీతాకోకచిలుకలే కీలకం. ఐక్యరాజ్యసమితి ‘ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) ప్రకారం ప్రపంచంలోని 75 శాతం వ్యవసాయానికి పరాగసంపర్కం అవసరం. సీతాకోక చిలుకలు అంతరించిపోతే, వాటి లార్వాలు, ప్యూపాలు తిని బతికే అనేక ఇతర జీవులకూ ప్రతికూల పరిణామాలే ఎదురవుతాయని పర్యావరణ నిపుణులు అంటున్నారు. వ్యవసాయంలో వాడే పురుగుమందులు, కలుపునివారిణి సీతాకోకచిలుక లార్వాలు, ఆహారం కోసం ఆధారపడే అతిధేయ మొక్కలైన మిల్క్ వీడ్స్ ను నాశనం చేస్తాయి. కాబట్టి సీతాకోకచిలుకల సంరక్షణకు చర్యలు ప్రారంభించాల్సిన అవసరం ఉంది.
వివిధ రాష్ట్రాల్లో పార్కుల ఏర్పాటు
సీతాకోకచిలుకల సంఖ్యను పెంచడానికి ప్రత్యేకంగా పార్కులను ఏర్పాటు చేయాలని, అందుకు కావాల్సిన ఆర్థిక సాయం అందిస్తామని భారత పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు వీటిని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ లోని ఇండోర్, భోపాల్ లలో ఇలాంటి పార్కులు ఏర్పాటు చేశారు కూడా. భోపాల్ లోని వనవిహార్ నేషనల్ పార్క్ లోని సీతాకోకచిలుకల ఉద్యానవనం ప్రారంభమైన మొదటి సంవత్సరంలోనే కనీసం మూడు డజన్ల జాతుల సీతాకోక చిలుకలు వృద్ధి చెందాయి. రక్షణ అవసరమయ్యే, అంతరించిపోతున్న126 రకాల జాతుల సీతాకోక చిలుకలను ప్రభుత్వ వన్యప్రాణి రక్షణ చట్టం1972 లోని షెడ్యూల్ 1 జాబితాలో చేర్చారు. జువాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హిమాలయాల్లో చేసిన స్టడీలో సీతాకోకచిలుకలు యాక్టివ్ పోలినేటర్స్ అని తేలింది. అరుదైన, అంతరించిపోతున్న సీతాకోకచిలుక జాతులను సంరక్షించడానికి ఒక మిషన్ ను ఏర్పాటు చేశారు.
రక్షణ చర్యలు చేపట్టాలె
2013 నాటికి భూమిపై ఉన్న మిలియన్ల అకశేరుకాల జాతులలోని అయిదింటిలో ఒకటి అంతరించిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ పరిరక్షణ సంస్థలు తెలుపుతున్నాయి. అత్యంత ముఖ్యమైన కొన్ని జాతులు పూర్తిగా అదృశ్యం కాకముందే సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆవాసాల విధ్వంసం, పురుగు మందుల వాడకం, వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న కాలుష్యం, వేట మొదలైన కారణాలతో జీవులు పెద్ద ఎత్తున మార్పులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కాబట్టి ప్రభుత్వం రక్షిత ప్రాంతాలను విస్తరించడం, అనుసంధానించడం, వాటిని సమర్థంగా నిర్వహించడంపై దృష్టి సారించాలి. స్థానిక సంస్థలు, పౌరసమాజంతో కలిసి పనిచేయడం లాంటి చర్యలతో జీవ జాతులను రక్షించాలి. సీతాకోకచిలుకలను రక్షించే ప్రయత్నాలు కొన్ని చేస్తున్నప్పటికీ, వాటి దీర్ఘకాల మనుగడను నిర్ధారించడానికి ఇంకా కృషి చేయాలి.
డా. చిందం రవీందర్,
ఎంఎస్సీ, ఎంఎడ్,
పీహెచ్ డీ