
2019 లో వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్న ఇంగ్లాండ్ జట్టు ఆ తర్వాత ఆ స్థాయిలో రాణించలేకపోతుంది. టీ20ల్లో అదరగొడుతున్నా.. టెస్టుల్లో పర్వాలేదనిపిస్తున్నా వన్డేల్లో మాత్రం విఫలమవుతూ వస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ ఆట చూస్తుంటే అసలు వన్డేలు ఎలా ఆడాలో మర్చిపోయారనే సందేహం కలుగుతుంది. ఆడిన తొలి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయారు. భారీ స్కోర్ కొట్టి ఆస్ట్రేలియా మీద ఓడిపోయిన బట్లర్ సేన బుధవారం(ఫిబ్రవరి 26) ఆఫ్ఘనిస్తాన్ పై ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. జట్టులో చూడడానికి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ నిలకడగా రాణించడంతో విఫలమవుతుంది.
బట్లర్ వన్డే కెప్టెన్సీ పగ్గాలు చేపట్టినప్పటినుంచి ఇంగ్లాండ్ 50 ఓవర్ల ఫార్మాట్ లో ఘోరంగా విఫలమవుతుంది. కెప్టెన్ గా, బ్యాటర్ గా విఫలమవుతున్నాడు. దీంతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు బట్లర్ ను వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని చూస్తున్నట్టు సమాచారం. వస్తున్న నివేదికల ప్రకారం బట్లర్ కెప్టెన్సీపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. బట్లర్ ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తుందట. అతని స్థానాల్లో హ్యారీ బ్రూక్ ఇంగ్లాండ్ కెప్టెన్ గా ఎంపికయ్యే అవకాశం ఉంది. మరోవైపు బట్లర్ మాత్రం ఇంగ్లాండ్ కెప్టెన్సీ చేపెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.
Also Read : హైదరాబాద్‌లో ఫిఫా అకాడమీ..!
వన్డేల్లో ఇంగ్లాండ్ ప్రదర్శన చూసుకుంటే చివరి 9 వన్డేల్లో 8 మ్యాచ్ ల్లో ఓడిపోయారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ పై 0-3 తేడాతో క్లీన్ స్వీప్ అయ్యారు. ఇక అంతకముందు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో 3 మ్యాచ్ ల్లో పరాజయం తప్పలేదు. భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ లోనూ ఇంగ్లాండ్ సెమీస్ కు చేరడంలో విఫలమైంది. ఈ టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోవడం సంచలనంగా మారింది. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ తమ చివరి మ్యాచ్ లో శనివారం (మార్చి 1) సౌతాఫ్రికాతో తలపడుతుంది. కెప్టెన్ గా వన్డేల్లో బట్లర్ కు ఇదే లాస్ట్ మ్యాచ్ అని ఇంగ్లాండ్ నివేదికలు చెబుతున్నాయి.