బ్రిటిష్ ఉత్పత్తులనే కొనుగోలు చేయండి

  •  బ్రిటన్ ప్రధాని రిషి సునక్  ట్వీట్

లండన్: బ్రిటన్ ప్రజలు స్వదేశీ ఉత్పత్తులే కొనాలని ఆ దేశ ప్రధాని రిషి సునక్ విజ్ఞప్తి చేశారు. విదేశీ కూరగాయలు, పండ్లపై ఆధారపడడాన్ని తగ్గించాలని ఆయన ట్వీట్ చేశారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. వచ్చే నెల 4న యూకేలో జనరల్ ఎలక్షన్ నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్  చేశారు. అయితే సునక్ ట్వీట్ కు మిశ్రమ స్పందన వచ్చింది. ఆయన సూచనను కొందరు సమర్థించగా మరి కొందరు వ్యతిరేకించారు. 

వ్యవసాయం, వాణిజ్యంపై బ్రెగ్జిట్  ప్రభావం వల్ల రిషి సూచనను పాటించడం అంత సులువు కాదని పలువురు పేర్కొన్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఉత్పత్తులను కొనడం చాలా కష్టమన్నారు. కొందరు మాత్రం రిషి సూచనను సమర్థించారు. స్వదేశీ వస్తువులే కొంటామన్నారు. ‘‘మనల్ని మనం పోషించుకోవడానికి చాలినంత ఆహారాన్ని మనం పండించడం లేదు.

 బ్రెగ్జిట్  వల్ల పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పారు. కానీ, రోజురోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి” అంటూ మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. సూపర్ మార్కెట్లలో షెల్ఫ్ లు ఖాళీగా ఎందుకు ఉంటున్నాయో తెలుసుకోవాలని అంటున్నారు.