ఖమ్మం/ఖమ్మం రూరల్, వెలుగు: జిల్లాలోని రూరల్ మండలంలో వారం రోజులుగా ఎవరి నోట విన్నా ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లు, ఫేక్ రిజిస్ట్రేషన్లు, బతికున్న వ్యక్తులను చనిపోయినట్లు డెట్ సర్టిఫికెట్లు సృష్టిస్తున్నారనే చర్చ నడుస్తోంది. వీటి ద్వారా రూ.కోట్ల విలువైన ఆస్తులను పేర్ల మార్పులు చేస్తున్నారు. కొందరు దళారులు ఫోర్జరీ సంతకాలతో కన్వర్షన్లు, లే అవుట్పర్మిషన్లు ఇచ్చి అనధికార వెంచర్లకు ఆజ్యం పోయడం వంటి విషయాలపైనే మాట్లాడుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో నాలుగేళ్లుగా ఏదులాపురం, వరంగల్ క్రాస్‌రోడ్, పెద్దతండా, గుర్రాలపాడు, పోలేపల్లి, గుదిమళ్ల, వెంకటగిరి వంటి గ్రామాల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన ప్రజల భయాందోళనకు గురవుతున్నారు. 2018 నుంచి ఇప్పటి వరకు ప్లాట్లు కొన్నవారు తాము కొన్నవి సురక్షితమేనా, రియల్టర్లు ఇచ్చిన డాక్యుమెంట్లు ఒరిజినల్ వా లేక ఫోర్జరీ చేసినవా అని తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఇళ్లు కట్టుకుని ఇక్కడే నివసిస్తున్న వారు సైతం ఆయోమయంలో పడ్డారు. ఇంత జరిగాక కొన్న ప్లాటు, కట్టిన ఇల్లు సర్టిఫికెట్లు సరైనవి కాకుంటే తాము, తమ పిల్లల భవిష్యత్ ఏంటని మదనపడుతున్నారు.
నకిలీవి ఎందుకు పుట్టినట్లు..?
2018లో ఖమ్మం రూరల్ మండలంలోని గుదిమళ్ల, వెంకటగిరి, గుర్రాలపాడు, ఏదులాపురం, పోలేప్లలిలను ఖమ్మం మున్సిపల్కార్పొరేషన్లో విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లను వేసి ప్లాట్లుగా చేసి అమ్మకానికి సిద్ధంగా ఉన్న సమయంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంతో వారు ఈ నకిలీ పర్మిషన్లకు తెరలేపారు. పంచాయతీలో ఇంటి పర్మిషన్ తీసుకుంటే రూ. పది వేల నుంచి రూ.15వేల వరకు ఖర్చు అవుతుంది. అదే మున్సిపల్లో తీసుకోవాలంటే సుమారు రూ. 70వేల నుంచి లక్ష వరకు ఖర్చు అవుతుందని భావించి ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ల సృష్టికి ఎగబడ్డారు.
ఇదే అదునుగా భావించిన కొందరు దళారులు జీపీ సెక్రెటరీలు, స్పెషల్ ఆఫీసర్లతో మాట్లాడుకుని ఇంటి అనుమతి పత్రాలు ఇప్పించడం మొదలుపెట్టారు. ఇక్కడి అధికారులు బదిలీపై వెళ్లాక కూడా వారి సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ పర్మిషన్లు ఇస్తూ రూ.లక్షలు దండుకున్నారు. ఈ విషయం ఇప్పుడు బయటకు రావడంతో ఈ ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకున్నవారు, బిల్డర్ల వద్ద కొన్నవారు తమ సర్టిఫికెట్లు అసలువా, నకిలీవా అని ఆందోళన పడుతున్నారు.
ఫోర్జరీ ఘటనతోనే అనుమానాలు..
ఇటీవల జరిగిన ఫోర్జరీ సంతకాలు, నకిలీ డెత్ సర్టిఫికెట్ల ఘటన తరువాత రూరల్ మండలంలో ప్లాట్లు కొన్న కస్టమర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఫోర్జరీ వ్యవహారం కేవలం ఇంటి పత్రాలకే పరిమితమైందా లేక సర్వే నెంబర్లు, పాస్ పుస్తకాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లకు కూడా పాకిందా అని సందేహిస్తున్నారు.
ఇప్పటికే రూరల్ మండలంలోని సబ్ రిజిస్ట్రార్ మాదిరి ఇప్పుడున్న అధికారి రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో తమ పిల్లల పెళ్లిళ్లు, చదువులు, భవిష్యత్తు కోసం కడుపుకాల్చుకుని కొన్న ప్లాట్ల డాక్యుమెంట్లు చిత్తు కాగితాల్లా పడి ఉన్నాయని, ఇప్పుడీ నకిలీ వ్యవహారంతో మరింత ఆగాధంలోకి నెట్టినట్లు అయ్యిందని కంగారుపడుతున్నారు.
రియల్టర్ల హస్తంతోనే జరిగింది!
ఫోర్జరీ డాక్యుమెంట్లు, ఇంటి పర్మిషన్ల విషయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు హస్తం లేదా, కేవలం దళారులే చేశారా, ఎవరి ప్రోద్బలం లేకుండానే ఇంత నడిచిందా అని కొనుగోలుదారులతోపాటు మండల ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతపెద్ద స్థాయిలో జరిగిన ఈ నకిలీ వ్యవహారంలో పోలీసులు తిమింగలాలను వదిలి చిన్న చేపలను పట్టుకుని చేతులు దులుపుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికైనా ఈ నకిలీ వ్యవహారానికి కారకులైన రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోణంలో విచారిస్తే తిమింగలాలే బయటకువచ్చే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. దళారులే రూ.కోట్లలో వెనుకేసుకుంటే వ్యాపారులు రూ.వందల కోట్లు సంపాదించుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.