భద్రాచలం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో లక్ష్యం మేరకు వడ్లు కొనుగోలు పూర్తి కాకుండానే గడువు ముగిసిందనే కారణంతో ప్రభుత్వం వడ్ల కొనుగోలు సెంటర్లను అధికారులు మూసేశారు. వరదలు, భారీ వర్షాల నేపథ్యంలో ఆలస్యంగా సాగు చేసిన వరి పంట ఇటీవలే కోతకు వచ్చింది. ఈ నెల 25 వరకే ప్రభుత్వం గడువు పెట్టిందని చెబుతున్న అధికారులు కొనుగోలు కేంద్రాలను మూసేయాలని నిర్ణయించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
లక్ష్యం మేరకు కొనుగోలు చేయలే..
జిల్లాలో 1.64 లక్షల ఎకరాల్లో వానాకాలం పంటలో భాగంగా వరి సాగు చేశారు. వడ్ల కొనుగోలు కోసం పీఏసీఎస్‌ల ద్వారా124, ఐకేపీ ద్వారా 3, జీసీసీ ద్వారా 32 చొప్పున జిల్లాలో 159 కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1.50 లక్షల టన్నుల వడ్లను కొనాలని టార్గెట్‌గా పెట్టుకొని, ఇప్పటి వరకు1,04,400 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. కొనుగోళ్లకు బుధవారం కటాఫ్ డేట్‌గా పెట్టగా, గతంలోనే 51 సెంటర్లు మూతపడ్డాయి. మిగిలిన108 కేంద్రాలను కూడా మూసేయనున్నారు. ఈ ఏడాది వరుస వరదల కారణంగా పంటలు నీట మునిగాయి. తిరిగి సాగు చేయడానికి రైతులు ఇబ్బందులు పడ్డారు. బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాల్లో 3305 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. వీటితో పాటు మరికొన్ని మండలాల్లో కూడా వరి సాగు ఆలస్యమైంది. ఇవన్నీ ఇప్పుడిప్పుడే కోతకు వస్తున్నాయి. ఈ సమయంలోనే ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ఎత్తేయాలని నిర్ణయించడంతో తాము తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు.
కటాఫ్ డేట్ ప్రకారమే క్లోజ్
ప్రభుత్వం విధించిన కటాఫ్ డేట్ ప్రకారమే కొనుగోలు కేంద్రాలు క్లోజ్ చేయాల్సి ఉంటుంది. చాలా వరకు రైతులు కేంద్రాల్లో అమ్ముకున్నారు. ఇంకా కొంత ధాన్యం రైతుల వద్ద ఉంది. సెంటర్ల కొనసాగింపు అనేది కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఉంటుంది.
- అభిమన్యు, జిల్లా వ్యవసాయాధికారి
సెంటర్లను కొనసాగించాలి
వరద ప్రభావిత ప్రాంత రైతులను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాలను కొనసాగిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేయాలి. ఆలస్యంగా పంటలు సాగు చేసిన ప్రాంతాల్లో కేంద్రాలు కొనసాగించాలి. చివరి గింజ వరకు కొనేలా చర్యలు తీసుకోవాలి.
- యలమంచి వంశీకృష్ణ,
జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ రైతు సంఘం