- గుడి, బడి తేడా లేకుండా ఖాళీ స్థలాల్లో సెంటర్ల ఏర్పాటు
- సెంటర్లు పూర్తిగా తెరవకపోవడంతో దళారులదే రాజ్యం
కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసేందుకు జాగలు లేవు. దీంతో బడి, గుడి తేడా లేకుండా ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఇవి కూడా లేకపోవడంతో పొలాలు, కాలువ గట్ల మీద కాంటాలు పెడుతున్నారు. సర్కారు స్థలాలున్న చోట్ల కాస్త పర్వాలేదు కానీ, మిగతా ప్రాంతాల్లో వడ్లు పోసుకునేందుకు జాగ లేక రైతులు తిప్పలు పడుతున్నారు. దీంతో ఆరబెట్టుకొనేందుకు జాగ లేక కొందరు రైతులు దళారులకు అగ్గువకు వడ్లు అమ్ముకుంటున్నారు.
వడ్లు ఎక్కడ పోయాలి..
చివరి గింజ వరకు వడ్లు కొంటామని చెబుతున్న సర్కారు ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయడం లేదు. యేటా ఐకేపీ, సొసైటీల ఆధ్వర్యంలో గ్రామాల్లో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు లేని చోట వడ్లు పోసేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. జమ్మికుంట, హుజురాబాద్, వీణవంక, ఇల్లందకుంట మండలాల్లో గతంలో సర్కారు స్థలాలు లేని చోట్ల రోడ్ల మీదనే కాంటాలు నిర్వహించే వారు. కానీ ఈసారి పోలీసులు అభ్యంతరం చెబుతుండటంతో వడ్లు ఎక్కడ పోయాలోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
బ్రోకర్లదే రాజ్యం..
మార్కెటింగ్ శాఖ నుంచి లైసెన్స్ తీసుకున్న బ్రోకర్లు వడ్లు కొనుగోలు చేయవచ్చు. వీరు ప్రభుత్వానికి ఒక శాతం సెస్ , జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. జమ్మికుంట మండలంలో ఇలాంటి వారు ముగ్గురు మాత్రమే ఉన్నారు. కానీ జమ్మికుంట పరిధిలో మిల్లుల్లో పని చేసే చాలా మంది గుమాస్తాలు బ్రోకర్ల అవతారమెత్తారు. క్వింటాళ్ల చొప్పున కమీషన్ తీసుకుంటూ రైతులను దగా చేస్తున్నారు. వెంటనే డబ్బులు కావాలంటే రెండు శాతం క్యాష్ కటింగ్పెట్టి ఇస్తున్నారు. వీళ్లకు ఎటువంటి లైసెన్స్ లేనప్పటికీ, విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నారు. అయినప్పటికీ మార్కెటింగ్, సివిల్ సప్లై అధికారులు పట్టించుకోవడం లేదు. ఖమ్మం జిల్లా వైరా, సత్తుపల్లి, సూర్యాపేట జిల్లా కోదాడ, ఏపీలోని మండపేట, పెద్దాపురం, బనగానపల్లి బంజారా, నుంచి బడా వ్యాపారులు బ్రోకర్ల ద్వారా రూ.కోట్లలో వడ్లు కొంటున్నారు. దందా కొనసాగుతుండటంతో మార్కెటింగ్ శాఖకు రావాల్సిన సెస్, జీఎస్టీని ఎగ్గొడుతున్నారు.
ప్రైవేట్ భూముల్లో వడ్లు పోస్తున్నం
మా ఊళ్లో ఐకేపీ, ప్యాక్స్ ఆధ్వర్యంలో రెండు సెంటర్లు ఉన్నాయి. రెండు సెంటర్లు ఉన్నా ప్రభుత్వ స్థలం లేకపోవడంతో ప్రైవేటుగా వడ్లు అమ్మాల్సి వస్తోంది. మా గ్రామంలో ఖాళీగా ఉన్న కొద్ది ప్రాంతాల్లో ప్యాక్స్, ఐకేపీ సెంటర్ ద్వారా అమ్ముతున్నాం. గ్రామ శివారులో ఊరగుట్ట వద్ద ప్రభుత్వ స్థలం ఉంది. ఆ స్థలం లో సెంటర్ల కోసం స్థలం కేటాయిస్తే మాకు సౌకర్యంగా ఉంటుంది. -బత్తిని రాకేశ్, భూపాలపట్నం, చొప్పదండి మండలం
బ్రోకర్లే కొంటున్నరు
అధిక వర్షాల వల్ల వడ్లు దిగుబడి తగ్గింది. ఎకరానికి 25 క్వింటాళ్ల లోపే వస్తున్నాయి. వడ్లు ఆరబెడదామంటే గ్రామాల్లో ఎక్కడా స్థలం లేదు. రోడ్ల మీద ఆరబెట్టొద్దని పోలీసులు ఆదేశాలిచ్చారు. ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు తెరవకపోవడంతో బ్రోకర్లకు క్వింటాకు రూ. 1500 నుంచి 1600 లకే అమ్మకుంటున్నం. - చొప్పరి శ్రీనివాస్ ,బేతిగల్ గ్రామం , వీణవంక మండలం
కొన్ని ఏరియాల్లో ఇలా..
చొప్పదండి మండలం భూపాలపట్నంలో గతంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్థలంలో ఐకేపీ సెంటర్ నిర్వహించగా అక్కడ కాలేజీ నిర్మాణం పూర్తవడంతో ప్రైవేట్ స్థలాలను లీజుకు తీసుకొని సెంటర్లను నిర్వహిస్తున్నారు. ప్యాక్స్ సెంటర్ కెనాల్ సమీపంలో ఏర్పాటు చేయగా వడ్లు పోసేందుకు స్థలం లేక వ్యవసాయ భూములను లీజుకు తీసుకున్నారు. ఆ స్థలం కూడా సరిపోకపోవడంతో కాలువల వెంట, ఇతర ఖాళీ స్థలాలలో వడ్లు పోసుకుంటున్నారు. ఐకేపీ సెంటర్ కోసం కూడా స్థలం లేకపోవడంతో ఇండ్ల మధ్య ఉన్న కొద్దిపాటి స్థలాల్లో సెంటర్ను ఏర్పాటుచేశారు. అది కూడా సరిపోకపోవడంతో రైతులు పొలాలు, ఖాళీ ప్రాంతాలలో పోసుకొని అమ్ముకుంటున్నారు.
చొప్పదండి మండలం కొలిమికుంట గ్రామంలో కూడా సెంటర్ కోసం స్థలం లేదు. గతంలో పంచాయతీ వెనక ఉన్న స్థలంలో సెంటర్ నిర్వహించగా అక్కడ నర్సరీ ఏర్పాటు చేశారు. దీంతో గుడి సమీపంలోని కొద్దిపాటి జాగలో వడ్లను పోసి అమ్ముకుంటున్నారు.
ఇల్లందకుంట మండలం సీతంపేటలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి సరిపడా స్థలం లేక రైతులు రోడ్లపై, సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆవరణలో వడ్లను ఎండబెడుతున్నారు. కొంతమంది రైతులు ఇండ్ల ముందు
పోసుకుంటున్నారు.