నిజామాబాద్/వర్ని/బీర్కూర్, వెలుగు: రైతులకు మద్దతు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో వర్ని, పాత బాన్సువాడ, బీర్కూర్ మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సెంటర్లను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరి దిగుబడిలో బాన్సువాడ నియోజకవర్గం స్టేట్‌లో మొదటి స్థానంలో ఉందన్నారు. తెలంగాణా వచ్చే నాటికి రాష్ట్రంలో అన్ని రకాల పంటల దిగుబడులు 1.10 కోట్ల టన్నులు ఉంటే నేడు మూడు కోట్ల టన్నులకు చేరుకుందని తెలిపారు. ఇందులో 1.50 కోట్ల టన్నుల మేర వరి ధాన్యం పండిస్తున్నారని పేర్కొన్నారు. ఈ వానాకాలంలో రాష్ట్రంలో 65 లక్షల ఎకరాల్లో వరిపంట సాగైందన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం 7 వేల కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో 458, కామారెడ్డి జిల్లాలో 349 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ యేడాది నిజాంసాగర్‌లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, యాసంగి పంటకు ఎలాంటి ఇబ్బందులు ఉండయన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి కలెక్టర్ జితేష్ వి పాటిల్, బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, వర్ని జడ్పీపీటీసీ హరిదాసు, ఎంపీపీ మేక శ్రీలక్ష్మి పాల్గొన్నారు. బీర్కూర్‌లో జరిగిన ప్రోగ్రామ్‌లో ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూప, మాజీ ఎఎంసీ చైర్మన్ద్రోణవల్లి అశోక్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఆవారి గంగారాం, సోసైటీ చైర్మన్, విండో డైరెక్టర్లు, లీడర్లు పాల్గొన్నారు.
అర్హులందరికీ సొంతిల్లు..
నస్రుల్లాబాద్, వెలుగు: నియోజకవర్గంలోని అర్హులందరికీ సీఎం కేసీఆర్ సహకారంతో సొంత ఇల్లు ఇచ్చేందుకు కృషి చేస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. శనివారం కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో షాదీ ఖానా భవనం పనులు ప్రారంభించడంతో పాటు డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు వచ్చిన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యదికంగా బాన్సువాడ నియోజకవర్గానికే డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేసుకున్నామన్నారు. కులం, మతం, పార్టీకి సంబంధం లేకుండా అర్హులైన వారందరికీ ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ప్రభాకర్‌రెడ్డి, విండో చైర్మన్లు గంగారాం, సుధీర్, మారుతి, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ మహేశ్, మండల కోఆప్షన్ సభ్యులు మజీద్, టీఆర్‌ఎస్ సీనియర్ లీడర్లు ఏడే మోహన్, లక్ష్మీనారాయణగౌడ్, పురం వెంకట్ పాల్గొన్నారు.