
- సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : మధురైలో ఇటీవల జరిగిన పార్టీ 24వ ఆలిండియా మహాసభల్లో ఆహారం, ఇల్లు, ఉపాధి, విద్యా, ఆరోగ్యం, పింఛన్లను దేశంలోని ప్రతి పౌరుని హక్కులుగా చేయాలని తీర్మానించినట్లు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తెలిపారు. ఈ హక్కుల సాధనే యర్రా శ్రీకాంత్ కు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఖమ్మంలోని త్రీటౌన్ బోస్ బొమ్మ సెంటర్లో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు యర్రా శ్రీకాంత్ సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు.
ట్రంప్ నిర్ణయాల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉందన్నారు. ప్రపంచ దేశాలకు 125 శాతానికి పైగా వాణిజ్యసుంకాన్ని మోపేందుకు సిద్ధమయ్యారన్నారు. స్వేచ్ఛావాణిజ్యంపై ఆంక్షలు తెస్తున్నట్లు చెప్పారు. పార్టీ నేత తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ఎర్రజెండాను కాపాడిన ధీరుడు యర్రా శ్రీకాంత్ అని పేర్కొన్నారు. కష్టాలొస్తే గుర్తొచ్చేది కమ్యూనిస్టులేనన్నారు. కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు అమలు కావట్లేదని ఆరోపించారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ అసమానతలు లేని సమాజం కోసం పోరాడాల్సిన దశలో అందరితో కలిసిపోయి ప్రజా మన్ననలు పొందిన నాయకుడు శ్రీకాంత్ దూరం కావడం బాధకరమన్నారు. దోపిడీ, అసమానతలను రూపుమాపటమే కర్తవ్యంగా ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సీహెచ్ బాబూరావు, ఎస్.వీరయ్య, జూలకంటి రంగారెడ్డి. పోతినేని సుదర్శన్, బండారు రవికుమార్, మచ్చా వెంకటేశ్వర్లు, బుగ్గవీటి సరళ, నగర మేయర్ పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు.