ఖమ్మం టౌన్, వెలుగు: బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఇండియా కూటమితో ముందుకెళ్తోందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు చెప్పారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని ప్రమాదకర స్థాయికి తీసుకెళ్లిందని విమర్శించారు. ఎన్టీఏ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ స్వభావమే మారిపోతుందన్నారు. శనివారం ఖమ్మంలో జరిగిన సమావేశానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి రాఘవులు హాజరయ్యారు. బీజేపీకి 370, ఎన్‌డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని మోదీ, కార్పొరేట్‌శక్తులు, వారి అనుకూల మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయన్నారు.
ప్రపంచవ్యాప్తంగా తమ కీర్తి ప్రతిష్టలు పెరిగాయని అంతర్జాతీయ మీడియా సంస్థల ద్వారా బీజేపీ ప్రచారం చేయించుకుంటోందని ఎద్దేవా చేశారు. ఈ ప్రచారాన్ని నమ్మి ప్రజలు ఓట్లు వేస్తారన్న భ్రమలో బీజేపీ ఉందన్నారు. గెలుస్తామని నమ్మకం ఉన్నప్పుడు ప్రతిపక్ష లీడర్లు, సీఎంలను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే ఈడీ, సీబీఐతో దాడులు చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్నికల బాండ్లు తీసుకోని ఏకైక పార్టీ సీపీఎం మాత్రమే అన్నారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన మీటింగ్‌లో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, బొంతు రాంబాబు, వై.విక్రం, వెంకటేశ్వర్లు, చింతలచెర్వు కోటేశ్వరరావు పాల్గొన్నారు.