తుక్డే తుక్డే గ్యాంగ్ అనడం.. కులగణనను వ్యతిరేకించడమే!

తుక్డే తుక్డే గ్యాంగ్ అనడం.. కులగణనను వ్యతిరేకించడమే!

ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తీసుకురావడం ద్వారా బీసీలకు ఐఏఎస్,  ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసు పోస్టులు అందకుండా చాపకింద నీరులా  మోదీ అమలు చేస్తున్నారు. మహారాష్ట్ర లోని వార్దాలో ప్రసంగిస్తూ రాహూల్ గాంధీపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ దేశాన్ని ముక్కలు చేసి..జాతీయవాదాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ లోని తుక్డే తుక్డే గ్యాంగ్ పనిచేస్తోందన్నారు.

దేశాన్ని ముక్కలు చేయడం అంటే ఏమిటి? ఈ దేశంలో తరతరాలుగా కలిసిమెలిసి ఉన్న హిందూ, ముస్లింలను వేరు చేయడమా? లేక వారంతా ఒక్కటే అని కలపడమా?  ఈ దేశంలో అన్ని మతాల ప్రజలు ఒక్కటే అనే సమైక్యతా భావాన్ని పెంపొందిస్తున్న కాంగ్రెస్ తుక్డే గ్యాంగ్ ఎట్లవుతుంది? ఈ అంశంలో లోతుగా పరిశీలిస్తే బీసీల ఎదుగుదలను అడ్డుకునే ఆలోచనగా అర్థం అవుతోంది.

మోదీ ప్రధాని అయిన తరువాత 2019లో ఆధిపత్య కులాల పేదల కోసం 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఈడబ్ల్యూఎస్​ను అమలులోకి తెచ్చారు. నిజానికి దేశానికి స్వాతంత్య్రం రాక ముందు.. ఆ తరువాత ఆర్థిక, విద్య, రాజకీయ, సామాజిక తదితర రంగాల్లో ఆధిపత్యం కొనసాగిస్తోంది పిడికెడున్న ఆధిపత్య కులాలు మాత్రమే. మోదీ గానుగతో నూనె తీసే కులం.. ఆయన కులాన్ని గుజరాత్ ప్రభుత్వం బీసీలోకి మార్చింది కాబట్టి ఆయన తనను బీసీగా పేర్కొంటున్నారు.   

దేశంలోని 90శాతం సంపదకు యజమానులుగా కొనసాగుతున్న ఆధిపత్య కులాలకు రిజర్వేషన్లు ఎందుకు? రిజర్వేషన్లను సామాజికంగా వెనుకబాటుకు గురైన వర్గాలకు కేటాయించాలని రాజ్యాంగం చెప్తోంది. 

రాహుల్​ గాంధీ హామీ

పార్లమెంట్​ఎన్నికల సమయంలో ఈ దేశంలో కులగణనను చేపట్టి తీరుతామని రాహుల్ గాంధీ హామీ ఇవ్వడమే కాకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టించడం జరిగింది.  కులగణన లెక్కల ఆధారంగా ఆయా కులాలకు రిజర్వేషన్లను కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.  

77 ఏండ్ల స్వాతంత్ర్య దేశంలో నేటికీ అణచివేతకు గురైన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని ప్రకటించడమే రాహూల్ గాంధీ చేసిన తప్పా? ఈ దేశంలోని మెజారిటీ ప్రజలకు న్యాయం చేసేందుకు రాహుల్ చేస్తున్న కృషిని ఆయా వర్గాలు ఖచ్చితంగా స్వాగతిస్తాయి. మోదీ ఎన్ని విమర్శలు చేసినా రాహుల్ గాంధీని ప్రజలు గుండెల్లో నిలుపుకుంటారు.

బీసీల అభ్యున్నతికి అడ్డుగోడ

దేశాన్ని కులాల పేరిట విడగొట్టాలని చూడటమన్నా,  దేశ ప్రజలను కులాల పేరిట గుర్తించి వారి జనాభా ఎంతో తేల్చడం ద్వారా జాతీయభావాన్ని దెబ్బతీసినట్లే అనేది మోదీ వాదన.  కులగణన చేపడితే ఏ కులం వాళ్లు ఎంత శాతం ఉన్నారు?  వారి జీవన స్థితిగతులు ఏమిటి?  సామాజిక, విద్య, రాజకీయంగా సమానత్వాన్ని కల్పించడానికి అవకాశం లభిస్తుంది. ఇది మనువాద ఆలోచనకు వ్యతిరేకం. 

కాబట్టే మోదీ వ్యతిరేకిస్తున్నారు.   మోదీ నిజంగా బీసీ అయితే బీసీల సంక్షేమాన్ని కోరాలి కదా?  మరి తన కేబినెట్ లో  బీసీలకు దామాషా ప్రకారం మంత్రి పదవులు ఇవ్వాలి కదా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బీసీల అభ్యున్నతికి అడ్డుగోడ కట్టకూడదు కదా? మోదీ మనువాదపు బీసీ తప్ప మనవాడైన బీసీ కాదు.  ఆర్ఎస్ఎస్ కులగణనను  చేపట్టాలని చేసిన సూచనను కూడా మోదీ ఎందుకు అమలు చేయడం లేదు ఎందుకో తెలియాలి!

- జంగిటి వెంకటేష్