తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిండు: వివేక్ వెంకటస్వామి

సీఎం కేసీఆర్ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి తన సొంత ఆస్తులను పెంచుకున్నడని మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. తెలంగాణను అప్పులు రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ కే చెల్లిందని అన్నారు. రూ.60వేల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్ల వరకు అప్పులు చేశారని మండిపడ్డారు. అప్పుగా తెచ్చిన సొమ్మంతా  ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు.. కాళేశ్వరంలో రూ.65,000 కోట్లు, మిషన్ భగీరథలో రూ.45,000 కోట్లు, మిషన్ కాకతీయలో 25,000కోట్ల కుంభకోణం జరిగిందని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే మునుగోడులో సంక్షేమ పథకాలన్నీ బంద్ చేస్తామని మంత్రి జగదీష్ రెడ్డి ప్రజలను భయపెట్టడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజల సొమ్ముతోనే పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నారే తప్ప కేసీఆర్ సొంత డబ్బుతో కాదని అన్నారు. కేసీఆర్ ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తేలేదని వివేక్ వెంకటస్వామి హెచ్చరించారు. ముఖ్యమంత్రి మెడలు వంచి ప్రజలకు రావాల్సిన పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, నిరుద్యోగ భతి, రుణమాఫీ వచ్చేలా బీజేపీ పోరాటం చేస్తుందన్నారు. 

మునుగోడు ఫలితాలు తెలంగాణలో మార్పు

మునుగోడు  ఉప ఎన్నిక రాష్ట్రంలో మార్పు తీసుకువస్తుందని వివేక్ వెంకటస్వామి అన్నారు. బైపోల్ తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ ఖేల్ ఖతం అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజల్లో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందని..వచ్చే ఎన్నికల్లో కారు పార్టీకి 10 నుంచి 15 సీట్లు మాత్రమే వస్తాయని అన్నారు. టీఆర్ఎస్ కు మునుగోడు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. గత ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ చౌటుప్పల్ లో డిగ్రీ కాలేజీ కట్టిస్తానని హామీ ఇచ్చి మర్చిపోయారని..ఇప్పుడు ఉప ఎన్నిక రావడంతో మళ్లీ ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 

మునుగోడులో అధ్వానంగా రహదారులు

మునుగోడు నియోజకవర్గంలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని..కనీసం వాటకి మరమ్మతులు కూడా చేయలేదని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ఇక్కడ 100 పడకల ఆస్పత్రిని కట్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి...ఎన్నికలు అయిపోగానే మర్చిపోయారని దుయ్యబట్టారు. ఇక్కడ ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించేందుకు కేంద్రం నుంచి రూ.200 కోట్ల నిధులు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశామని..ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రజల కష్టాలు పట్టించుకోని సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకుని అవినీతిలో మునిగిపోయారని ఆరోపించారు.

దళితుల ఇంట్లో సహపంక్తి భోజనం చేయనున్న వివేక్ వెంకటస్వామి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లింగోజిగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామికి బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు. ఇంటింటికి తిరుగుతూ రాజగోపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం దళితవాడలో దళితుల ఇంట్లో సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొని వివేక్ వెంకటస్వామి భోజనం చేయనున్నారు.