ఉప ఎన్నికలొస్తయ్.. మేం గెలుస్తం.. హైదరాబాద్​ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నం: కేటీఆర్​

ఉప ఎన్నికలొస్తయ్.. మేం గెలుస్తం.. హైదరాబాద్​ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నం: కేటీఆర్​
  • పార్టీ నేతలకు విప్​ జారీ చేస్తం.. ధిక్కరిస్తే సస్పెండ్​ చేస్తం: కేటీఆర్​
  • మళ్లీ బీఆర్​ఎస్​దే అధికారం.. కేసీఆరే సీఎం అయితరు
  • రేవంత్​ తీరు వల్ల కాంగ్రెస్​ అంటేనే ప్రజలు అసహ్యించుకుంటున్నరు
  • డీలిమిటేషన్​ జరిగితే గ్రేటర్​ హైదరాబాద్​లోనే ఎక్కువ సీట్లు పెరుగుతయ్​
  • అక్కడ  కాంగ్రెస్​, బీజేపీ కన్నా బీఆర్​ఎస్​ పార్టీనే బలంగా ఉంది
  • రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులున్నా  పైసా ప్రయోజనం లేదు
  • అక్టోబర్​లో బీఆర్​ఎస్​ అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడి 

హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో త్వరలోనే ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయని, బీఆర్​ఎస్​ గెలుస్తుందని ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు.  హైదరాబాద్​ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నామని, దీనిపై పార్టీ కౌన్సిలర్లకు విప్​ను జారీ చేస్తామని, ఎవరైనా ధిక్కరిస్తే సస్పెండ్​ చేస్తామని హెచ్చరించారు. సరైన బలం లేదుకాబట్టే అభ్యర్థిని నిలబెట్టలేదని ఆయన చెప్పారు. శనివారం తెలంగాణ భవన్​లో గ్రేటర్​ హైదరాబాద్​ నేతలు, కార్యకర్తలతో బీఆర్​ఎస్​ సిల్వర్​ జూబ్లీ వేడుకల సన్నాహక సమావేశం జరిగింది. ఇందులో కేటీఆర్​ మాట్లాడారు. 

‘‘ఇప్పుడు కాదు.. మూడు నెలలో.. ఆరు నెలలో లేదంటే మరో ఏడాదికో ఎప్పుడు ఉప ఎన్నికలొచ్చినా తుఫాను వాతావరణంలో గులాబీ జెండా ఎగురుతుంది” అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్​ఎస్​ పార్టీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్​ సీఎం అవుతారని  ధీమా వ్యక్తం చేశారు.  ‘‘రేవంత్​ రెడ్డి పిచ్చి పనులతో కాంగ్రెస్​ పార్టీ అంటేనే ప్రజలు అసహ్యించుకుంటున్నరు.  ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలే బీఆర్​ఎస్​ను గెలిపించుకుంటారు. చేసిన పనులు చెప్పుకోలేకపోవడం వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయాం. డీలిమిటేషన్​ జరిగితే గ్రేటర్​ హైదరాబాద్​లోనే ఎక్కువ అసెంబ్లీ సీట్లు, ఎంపీ సీట్లు పెరుగుతాయి..  హైదరాబాద్​లో కాంగ్రెస్​, బీజేపీ కన్నా బీఆర్​ఎస్​ పార్టీనే బలంగా ఉంది” అని ఆయన వ్యాఖ్యానించారు. 

హెరాల్డ్​ కేసుపై రేవంత్​ ఎందుకు మాట్లాడ్తలే

 నేషనల్​ హెరాల్డ్​ కేసులో సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ మీద ఈడీ చార్జిషీట్​ నమోదు చేస్తే కాంగ్రెస్​ సీఎం అయిన రేవంత్​ రెడ్డి కనీసం ఒక్క మాట కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదని కేటీఆర్​ అన్నారు. ‘‘చోటే భాయ్​ రేవంత్​ రెడ్డికి బడే భాయ్​ మోదీకి మధ్య ఉన్న దృఢమైన బంధమే అందుకు కారణం” అని ఆరోపించారు. ‘‘హెచ్​సీయూ భూముల తనఖా విషయంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని సెంట్రల్​ ఎంపవర్డ్​ కమిటీ నివేదిక ఇచ్చినా.. విచారణ జరిపించేందుకు ప్రధాని మోదీ ముందుకు రావడం లేదు. అమృత్​ స్కామ్​లో ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీస్కోలే?  రెండు ఢిల్లీ పార్టీలైన కాంగ్రెస్​, బీజేపీకి రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం పట్టవు” అని వ్యాఖ్యానించారు.  కాంగ్రెస్​, బీజేపీ  ఒక్కటేనని ఆయన ఆరోపించారు.  

ఇద్దరు కేంద్ర మంత్రులతో పైసా ప్రయోజనం లేదు

‘‘రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులున్నరు.  ఒకరు సహాయ మంత్రిగా.. ఇంకొకరు నిస్సహాయమంత్రిగా ఉన్నరు. వారి వల్ల రాష్ట్రానికి పైసా ప్రయోజనం లేదు. 17 నెలల్లో పైసా పనిచేయలేదు” అని కేటీఆర్​ దుయ్యబట్టారు. ఏప్రిల్​ 27న సభ తర్వాత బీఆర్​ఎస్​ పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభిస్తామని, డిజిటల్​ మెంబర్​షిప్​ ఇస్తామని కేటీఆర్​ తెలిపారు. అక్టోబర్​లో పార్టీ అధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తామని వెల్లడించారు.