12 రాజ్యసభ సీట్లకు ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ

12 రాజ్యసభ సీట్లకు ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ
  • 14న నోటిఫికేషన్.. 21 వరకు నామినేషన్లు 
  • సెప్టెంబర్ 3న పోలింగ్, రిజల్ట్
  •  -తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో బైఎలక్షన్స్

న్యూఢిల్లీ, వెలుగు:  రాజ్యసభలో ఖాళీ అయిన12 సీట్లకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) బుధవారం షెడ్యూల్ రిలీజ్ చేసింది. తెలంగాణలోని ఒక స్థానంతో పాటు మరో 8 రాష్ట్రాల్లోని 11 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అస్సాం, బిహార్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, త్రిపుర రాష్ట్రాల నుంచి 10 మంది సభ్యులు ఇటీవల లోక్‌సభకు ఎన్నిక కావడం.. తెలంగాణ, ఒడిశా నుంచి ఒక్కొక్కరు తమ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. 

ఈ 12 సీట్లకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ రిలీజ్ చేసిన ఈసీ.. 14న నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్టు తెలిపింది. ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్టు షెడ్యూల్ లో పేర్కొంది. అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపుర రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26 వరకు.. బిహార్, హర్యానా, రాజస్థాన్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 27 వరకు గడువు ఇచ్చారు. అన్ని స్థానాలకు సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఫలితాలు వెల్లడించనున్నారు. 

కేకే రాజీనామాతో బైఎలక్షన్.. 

రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా వ్యవహరించిన కె.కేశవ రావు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. దీంతో తెలంగాణలో ఒక స్థానం ఖాళీ కావడంతో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ కు సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలో ఈ సీటును అధికార పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఈ స్థానంలో గెలుపొందే అభ్యర్థి 2026 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు.