
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జున స్వామి కృపతో ఆరు గ్యారంటీలు కచ్చితంగా అమలు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్అన్నారు. ఆదివారం కొమురవెల్లి మల్లన్న కల్యాణానికి హాజరైన ఆయన స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి స్వామివారీ లడ్డూ ప్రసాదం అందజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండ నెరవేర్చుతుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేశామని త్వరలోనే మిగతావి అమలు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మధుర్ జడ్పీటీసీ గిరికొండల్ రెడ్డి, ఎంపీటీసీలు లింగంపల్లి కనకరాజు, కొయ్యడ శ్రీనివాస్, నాయకులు సార్ల లింగం, ఆలయ ధర్మకర్తలు, హుస్నాబాద్ కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.