- ఇందులో గ్రాడ్యుయేట్, టీచర్స్, ఎమ్మెల్యే కోటా..
- భారీ ఆశలు పెట్టుకుంటున్న కాంగ్రెస్ నేతలు
- సభ్యత్వం కోసం వివిధస్థాయి లీడర్ల ప్రయత్నాలు
- యువ నేతలకు చాన్స్ ఇచ్చే యోచనలో అధిష్టానం
- మండలిలో ఇప్పటివరకూ బీఆర్ఎస్దే మెజార్టీ
- ఖాళీ స్థానాలను ఖాతాలో వేసుకోవడంపై కాంగ్రెస్ ఫోకస్
హైదరాబాద్, వెలుగు : వచ్చే ఏడాది మార్చి నాటికి శాసన మండలిలో 9 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ ఎమ్మెల్సీల జాబితాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి మూడేసి చొప్పున ఉండగా.. మజ్లిస్ నుంచి ఒకరు, ఇండిపెండెంట్ సభ్యులు ఇద్దరు ఉన్నారు. వీరిలో బీఆర్ఎస్ నుంచి శేరి సుభాశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, కాంగ్రెస్ తరఫున జీవన్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, ఎంఎస్ ప్రభాకర్, మజ్లిస్ నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్, ఇండిపెండెంట్లుగా అలుగుబెల్లి నర్సిరెడ్డి, కూర రఘోత్తం రెడ్డి ఉన్నారు.
ఈ 9 మంది పదవీకాలం మరో 4 నెలలు మాత్రమే ఉండడంతో కాంగ్రెస్ లోని చాలా మంది ఆశావహులు ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ సీట్లపై ఆశలు పెట్టుకుంటున్నారు. ఇందులో గ్రాడ్యుయేట్, టీచర్స్, ఎమ్మెల్యే కోటా నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలు ఉండగా, సభ్యత్వం కోసం వివిధ స్థాయి నేతలు ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. శాసన మండలిలో ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్న, మహేశ్ కుమార్ గౌడ్, ఆమెర్ అలీఖాన్, కోదండరామ్ ఎమ్మెల్సీలుగా ఉన్నారు.
గత మూడు నెలల కిందట బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీలు భానుప్రసాద్, సారయ్య, దండె విఠల్, ఎంఎస్ ప్రభాకర్, ఎగ్గె మల్లేశం, బుగ్గారపు దయానంద్.. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దీంతో ప్రస్తుతం మండలిలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 12 కు చేరింది. వీరితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఉన్న పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉంటూ మండలిలో కాంగ్రెస్ కు మద్దతుదారులుగా ఉన్నారు. ఈ లెక్కన శాసన మండలిలో కాంగ్రెస్ తన బలాన్ని 15 కు పెంచుకోగలిగింది.
యువ నేతలకు ప్రాధాన్యం!
యువ నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ కీలక పదవులు కట్టబెడుతూ, వారికి పార్టీపరంగా పెద్దపీట వేస్తున్నది. దీంతో రాష్ట్రంలోని యువ నేతలు మండలిలో అడుగుపెట్టేందుకు ఇప్పటి నుంచే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రం నుంచి ఎన్ఎస్ యూఐ నేత అనిల్ కుమార్ యాదవ్ కు హైకమాండ్ అవకాశం ఇవ్వగా, మరో ఎన్ఎస్ యూ ఐ నేత బల్మూరి వెంకట్ కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. ఇద్దరు యువ నేతలకు పార్టీలో ఇంతటి ప్రాధాన్యత దక్కడంతో, ఇప్పుడు ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా రాష్ట్రం నుంచి ఇంకొంతమంది యువ నేతలకు ప్రాధాన్యత ఉండనుందనే చర్చ కాంగ్రెస్ లో సాగుతున్నది.
ఇందులో సామాజిక సమీకరణలు, యువత, మహిళలు, పార్టీ విధేయులు, సీనియర్లు, పీసీసీలో కీలక పదవి ఆశించి భంగపడ్డ నేతలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లను త్యాగం చేసిన వారు..ఇలా వివిధ వర్గాల నుంచి ఈ పదవులకు పేర్లను పరిశీలిస్తారని పీసీసీ నేతలు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ అభిప్రాయాలకు తోడు పార్టీ బలోపేతానికి ఎవరిని మండలికి పంపించాలనే విషయంలో మాత్రం చివరకు హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ కానుందని పీసీసీ వర్గాలు అంటున్నాయి.
మరింత పట్టు సాధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు
శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులు ఉండగా, ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ సభ్యులే మెజార్టీలో ఉన్నారు. దీంతో మండలిలో ప్రభుత్వం ఏ బిల్లు ప్రవేశపెట్టినా.. అది ఆమోదం పొందడం ఇప్పుడు కాంగ్రెస్ కు కొంత ఇబ్బందికర పరిస్థితే ఉన్నది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఖాళీ అవుతున్న ఈ 9 స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో తన ఖాతాలో వేసుకునేలా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ నాయకత్వం ఇప్పటి నుంచే దీనిపై దృష్టి పెట్టింది. కాంగ్రెస్ కు బలమైన గొంతుకలను పంపించి, అసెంబ్లీలో పైచేయిగా ఉన్నట్టే మండలిలో కూడా తమ పట్టు పెంచుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది.