మామా అల్లుళ్ల గొడవ.. షాహిన్‌ అఫ్రిదిని అవమానించిన షాహిద్ అఫ్రిది

మామా అల్లుళ్ల గొడవ.. షాహిన్‌ అఫ్రిదిని అవమానించిన షాహిద్ అఫ్రిది

వన్డే ప్రపంచ కప్ 2023లో పేలవ ప్రదర్శన అనంతరం పాకిస్థాన్ క్రికెట్ లో అనేక మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మొత్తం సెలక్షన్ కమిటీని పునరుద్ధరించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. బాబర్ అజాం స్థానంలో కొత్త కెప్టెన్లను నియమించింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ షాన్ మసూద్ కు టెస్ట్ పగ్గాలు అప్పగించిన పీసీబీ.. లెజెండరీ పాక్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది అల్లుడు షాహీన్ అఫ్రిదిని టీ20 కెప్టెన్‌గా నియమించింది. అయితే తన అల్లుడు దారి తప్పి కెప్టెన్‌ అయ్యారని అతని మామ షాహిద్ అఫ్రిది నలుగురిలో అతన్ని అవమానపరిచారు.

ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న అఫ్రిది తన అల్లుడి స్థానంలో వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్‌ను పాకిస్తాన్ టీ20 కెప్టెన్‌గా నియమించివుంటే బాగుండేదని అభిప్రయపడ్డారు. తాను రిజ్వాన్ టీ20 కెప్టెన్‌గా ఉండాలని కోరుకున్నానని, అయితే షాహీన్ "పొరపాటున" ఆ బాధ్యతలు అందుకున్నారని నలుగురి ముందు వాపోయారు. ఈ మాటలు విన్న వెంటనే అక్కడున్న వారంతా నవ్వారు. 

రిజ్వాన్ పోరాట యోధుడని కితాబిచ్చిన అఫ్రిది, ఆట పట్ల నిబద్ధత, కఠోర శ్రమ అతడిని అత్యుత్తమ క్రికెటర్‌గా నిలిపాయని ప్రశంసించారు. ''రిజ్వాన్‌ అంటే నాకు చాలా ఇష్టం. అతనిలో బాగా నచ్చేది ఏంటంటే.. ఆటపై ఫోకస్. అతనికి ఇతర అంశాలతో పనిలేదు. ఎవరేం చేస్తున్నా పట్టించుకోడు. అతని దృష్టంతా ఆటపైనే ఉంటుంది. అతని నిబద్ధత చూసి నేనే ఆశ్చర్యపోయా..! నిజంగా అతన్ని నేను టీ20 కెప్టెన్‌గా చూడాలనుకున్నా. కానీ, పొరపాటున షాహీన్‌ కెప్టెన్ అయ్యాడు.." అని అఫ్రిది అన్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, ఆస్ట్రేలియా పర్యటన అనంతరం షాహీన్ కెప్టెన్సీలో పాకిస్థాన్‌ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో తలపడనుంది. జనవరి 12న ఈ సిరీస్‌ ప్రారంభంకానుంది. ఇక ఆసీస్ పర్యటనలో ఇప్పటికే రెండు టెస్టుల్లో ఓడిన పాక్.. మూడో టెస్టుకు సిద్ధమవుతోంది.  జనవరి  3 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.