మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు రేపు(మంగళవారం) జరగనున్నాయి. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు చెందిన 25 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు చనిపోవడంతో .. 28 స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలందరికీ బీజేపీ సీట్లు ఇచ్చింది. దీంతో ఇప్పటి వరకు ఆయా స్థానాలపై ఆశలు పెంచుకున్న బీజేపీ నేతలు అసంతృప్తిలో ఉన్నారు. తమకు కాకుండా కాంగ్రెస్ నుండి వచ్చిన వారికి టిక్కెట్లు ఎలా ఇస్తారని వీరు బీజేపీ నాయకత్వాన్నినిలదీస్తున్నారు. ఆరు స్థానాలలో బీజేపీ నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ టిక్కెట్ పైనో లేదా సమాజ్‌వాది పార్టీ టిక్కెట్ పైనో పోటీ చేస్తున్నారు. మరికోందరు బీజేపీ నేతలు స్వతంత్రులుగా రంగంలో నిలిచారు.
2018 ఎన్నికల్లోనూ పార్టీలో అంతర్గత కుమ్ములాటల కారణంగా 50 సీట్లును ఓడిపోయారు. ఇప్పుడు కూడ పరిస్థితి దాదాపు అలాగే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సింధియా గ్రూపు బీజేపీ లో చేరిన తర్వాత 14 మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. ఇంత మందికి మంత్రిపదవులు ఇవ్వడంపై బీజేపీ సీనియర్ నేతల్లో అసంతృప్తి నెలకొంది. అంతకుముందు మంత్రులుగా చేసిన, ఇతర పదవుల్లో పనిచేసిన దాదాపు 12 మంది సీనియర్ నేతలు మంత్రిపదవుల కోసం ఎదురు చూస్తున్నారు. వీరంతా కూడా సింధియా గ్రూపు పట్ల అసంతృప్తిగా ఉన్నారు. వీరందరూ కూడా ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు ఎటువంటి కృషి చేయడం లేదు. ఎన్నిక జరుగుతున్న 28 స్థానాల్లో దాదాపు 19 స్థానాల్లో బీజీపీ అంతర్గత సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ స్థానాల్లో గెలవడం కష్టంగా మారింది. దీనికి తోడు సింధియా గ్రూపు అభ్యర్ధులు సభలు, సమావేశాలు పెట్టినప్పుడు స్థానిక బీజేపీ నేతలను కలుపుకోని వెళ్లడం లేదు. ఈ పరిస్థితి ఇమర్తి దేవి సభ సందర్భంగా బహిరంగంగానే బయటపడింది. ఆమె సభలో వేదికపైకి పాత కాంగ్రెస్ నేతలందర్నీ కూర్చొపెట్టారు. స్థానిక సీనియర్ బీజేపీ నేతలను వేదిక ముందు వరసలో కూర్చొబెట్టారు. దీనిపై నేతలు బహిరంగంగానే మీడియా ముందుకు వచ్చి అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరోవైపు ఎన్నికల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేపట్టారు.