పోడు రైతుల గోడు పట్టదా?

యూపీఏ మొదటి ప్రభుత్వ హయాంలో ‘అటవీ హక్కుల చట్టం–2006’ వచ్చింది. ఈ చట్టం రూపొందించడంలో వామపక్షాలు, టీఆర్​ఎస్​ సహా 17 పార్టీలు భాగస్వాములయ్యాయి. అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీలన్నీ ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయి. అప్పుడు గొప్ప చట్టం అని చెప్పిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు ఇది తలాతోక లేని చట్టం అని తూలనాడటం దేనికి సంకేతం? 2018 అసెంబ్లీ ఎన్నికల టైమ్​లో పోడు సాగుదార్లందరికి ఆరు నెలల్లో పట్టాలిస్తామన్న హామీ ఏమైంది? పోడు రైతులపైకి ఫారెస్టు అధికారులను ఎగదోయటం, సాయుధ ఫారెస్టు చెక్ పోస్టులు పెంచడం, తిరిగి కేసులు పెట్టడం లాంటివి చేస్తున్నారు. పట్టాలు ఇస్తామని వాగ్దానం చేసిన వారు చేయవలసిన పనులేనా ఇవి?
పోడు ఒక జీవన విధానం
పోడుసాగు కేవలం ఒక వృత్తికాదు. అదొక జీవన విధానం. స్థిర వ్యవసాయానికి మొదటి దశ అయిన పోడు వ్యవసాయం మన దేశంలోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉంది. అయితే క్రమంగా తగ్గిపోతోంది. పోడు సాగుచేసి జీవించే కుటుంబాల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. కానీ మన అటవీశాఖ పోడు సాగుతో అడవిని నాశనం చేస్తున్నారని గుండెలు బాదుకుంటోంది. మన ప్రభుత్వాధినేతలు కూడా పోడు సాగువల్లనే అడవి తగ్గిపోతుందంటున్నారు. ఇది పూర్తిగా తప్పని చట్టం చెప్తోంది. మన తెలంగాణ అనుభవమే చూద్దాం. కలపను ముడి సరుకుగా వాడే పరిశ్రమలు కాగజ్ నగర్, కమాలాపుర్, సారపాకలో ఉన్నాయి. ఇవి వచ్చిన తర్వాతనే అడవి తగ్గిందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
అటవీ హక్కుల చట్టం– రెండు సవాళ్లు
అటవీ హక్కుల చట్టానికి వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసు మొదటి సవాల్. 1927 భారతీయ అడవుల చట్టం సవరణలు రెండో సవాలు. ‘వైల్డ్ లైఫ్ ఫస్ట్’ విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారులు ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ. వీరు అటవీ హక్కుల చట్టం చెల్లుబాటును ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టులో కేసు వేశారు. 2019 ఫిబ్రవరి 13న కోర్టు తిరస్కరించిన దరఖాస్తు దారుల్ని అటవీ భూముల నుంచి ఎందుకు తొలగించలేదని 21 రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను మందలించింది. జులై 12వ తేదీ నాటికి ఖాళీ చేయించాలని ఆదేశించింది. ప్రభుత్వం వైపు నుంచి సొలిసిటర్ జనరల్ వాయిదాకు హాజరుకాలేదు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ (ఎంవోటీఏ) పట్టించుకోలేదు. తెలంగాణలో కూడా 82,075 దరఖాస్తులు తిరస్కరించారు. పార్లమెంటు ఎన్నికల ముందు ఈ అంశంపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. అటవీ భూముల నుంచి ఖాళీ చేయించే తేదీని కోర్టు పొడిగించింది.


కేంద్ర ప్రభుత్వం 1927 చట్టానికి సవరణల పేరుతో అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసింది. చింతపండు, జిగురు, లక్క, దుంపలు, ఇతర ఎంఎఫ్ పీ(మైనర్ ఫారెస్ట్​ప్రొడ్యూస్)​ సేకరణ అటవీ నేరంగా పరిగణిస్తారట? ఇప్పుడు ఇచ్చిన పట్టాలు కూడా ఐదేండ్ల తర్వాత రద్దవుతాయట?. అటవీ భూమిని సాగు చేయటం మేజర్ నేరమౌతుందట? సెక్షన్ 80, 80(ఏ) ప్రకారం అటవీ భూములను, అటవీ ఫలసాయాన్ని కంపెనీలకు, కార్పొరేట్లకు అప్పగిస్తారట? వారే అటవీ ముడి సరుకుల్ని, అటవీ భూములను లాభసాటిగా, పర్యావరణ హితంగా నిర్వహించగలరట? అందుకే ఆదివాసీలు ఖాళీ చేయాలట! అంటే అటవీ ఉత్పత్తులు, అడవి భూములపై ఆధారపడి జీవిస్తున్న కొన్ని కోట్ల గిరిజన కుటుంబాలను అడవుల నుంచి ఖాళీ చేయించి కార్పొరేట్లకు బలి ఇవ్వటం అన్నమాట. 
గిరిజనుల పట్ల ప్రభుత్వాల వైఖరి ఏంటి?
ఎన్డీఏ హయాంలోనే సుమారు3 లక్షల గిరిజన కుటుంబాలను 1,52,400 ఎకరాల అటవీ భూమిలోంచి ఖాళీ చేయించారు. ఇది ప్రధానంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరిగింది. 2004 ఆగస్టులో లోకసభలో ఓ ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానం ఇది. 1988 అటవీ విధానం ప్రకారం గత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గిరిజనులను అటవీ భూముల్ని నుంచి తొలగించే ప్రయత్నం చేసింది. రీబ్యాక్ పాలసీ పేరుతో పోడు పునరావాస పథకాలు ప్రవేశ పెట్టింది. పోడు సాగు మానివేస్తే రూ.25 వేలు ఇస్తామని ఆశ పెట్టింది. కొన్ని రాష్ట్రాలలో అమలు చేసి గిరిజనుల నుంచి వ్యతిరేకత చవిచూసింది. టీఆర్ఎస్ సర్కార్​కు చిత్తశుద్ధి లేకనే పోడు భూముల గుర్తింపు ప్రక్రియ సజావుగా సాగడం లేదు. ప్రభుత్వ మద్దతున్న భూస్వాములు కూడా దీన్ని అడ్డుకున్నారు. ఫలితంగా పోడు సాగుదారులైన ఆదివాసీలు ఇబ్బందులు పడుతున్నారు. ఫారెస్టు ఆఫీసర్ల వేధింపులు, లంచగొండితనంతో ఆదివాసీలపై తప్పుడు కేసులు, జైళ్లు, నిర్బంధాలు పెరిగిపోతున్నాయి. దీంతో అడవి బిడ్డలు తాము పుట్టి పెరిగిన అడవుల్లో పరాయివాళ్లుగా భయపడుతూ బతుకులు వెళ్లదీస్తున్నారు.

ఆదివాసీల పట్ల ఇంత అమానుషమా?
అటవీ హక్కుల చట్టం భూ పంపిణీ చట్టం కాదు. అలాగే షెడ్యూల్ చట్టం కూడా కాదు. ఏ చట్టంలోనైనా అటవీ భూమిగా పేర్కొన్న భూమిపై సాగుదార్లుగా ఉన్న గిరిజనులైతే 2005, డిసెంబరు 13వ తేదీకి ముందు, మిగతావారు 75 ఏండ్లుగా సాగులో వుంటే.. కుటుంబానికి 10 ఎకరాలకు మించకుండా పట్టాలివ్వాలి. కేసులు ఎత్తివేయాలి. అటవీ గ్రామాలన్నింటిని రెవెన్యూ గ్రామాలుగా మార్చాలి. గ్రామ ఉమ్మడి అవసరాల కోసం కూడా భూమి కేటాయించాలి. ఈ గుర్తింపు కూడా ఫారెస్టు రైట్స్ కమిటీ(ఎస్ఆర్‌‌సీ) ద్వారా జరగాలి. ఈ హక్కు పత్రాలు ఉన్న భూమిని అమ్ముకునే హక్కులేదు. ఎన్నితరాలైనా సాగు చేసుకొని బ్రతికే హక్కు మాత్రమే ఉంటుంది. ఆసిఫాబాద్ జిల్లా కొలాంగోంది గ్రామంలో 17 ఆదివాసీ కుటుంబాలు 45 ఏండ్లుగా 100 ఎకరాలలోపు భూమి సాగు చేసుకుంటూ బతుకుతున్నారు. ఫారెస్టు అధికారులు వారికి కల్లబొల్లి మాట చెప్పి రాత్రికి రాత్రే ఖాళీ చేయించారు. హైకోర్టు జోక్యంతో మాత్రమే వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. వాళ్లకు ఇస్తానన్న భూమి ఇవ్వలేదు, ఇండ్లు కట్టలేదు. ఆదివాసీల బతుకుల్ని బండలు చేసి హరితహారం నిర్మిస్తారా? అలాగే వలస ఆదివాసీల పట్ల రాష్ట్ర సర్కార్ మరింత అమానుషంగా వ్యవహరిస్తోంది. సాటి మనుషులకు కనీస గౌరవం ఇవ్వకపోవటం ఏమిటి?
పోడు చేసేవారు ఆక్రమణదార్లు కాదు
బ్రిటీష్ పాలనలో కానీ, స్వాతంత్ర్యం తర్వాత కానీ రూపొందిన అటవీ చట్టాలను గమనిస్తే పోడు సాగుదార్లని (రైతులను) ఎక్కడా ఆక్రమణ దారులుగా పేర్కొనలేదు. వారిని అటవీ భూముల నుంచి తొలగించాలని కూడా లేదు. పైగా 1882 అటవీ చట్టం, 1927 భారతీయ అడవుల చట్టం, 1967 ఏపీ ఫారెస్టు చట్టం సెక్షన్ –4 నుంచి సెక్షన్​–15 వరకు అడవులు, అటవీ సంపదపై ఆదివాసీలకు ఉన్న హక్కులను చెప్తున్నాయి. ‘‘ఈ చట్టాలు రాక ముందు నుంచి అడవుల్లో ప్రజలున్నరు. వారి గ్రామాలు ఉన్నయి. అటవీ భూముల్లో పోడు చేసుకుని బతుకుతున్నరు. వారు రహదార్లు వాడుతున్నరు, మేపు భూములు, శ్మశానాలు(బొందల గడ్డ) లాంటి ఉమ్మడి అవసరాలకు అటవీ భూములు వాడుతున్నరు. ఫారెస్టు సెటిల్‌‌మెంట్ ఆఫీసర్లను(ఎస్ఏవో) నియమించి ముందుగా వారి నివాస, సాగు హక్కులు గుర్తించాలి. ఆ తర్వాతనే రిజర్వు ఫారెస్టు ప్రకటించాలి” అని చెప్తున్నాయి. ఇలాంటి భూములనే స్థూలంగా సెక్షన్–4 భూములు అంటారు. ఇవి ఉమ్మడి ఏపీలో 25 లక్షల ఎకరాలు ఉన్నట్లు కోనేరు రంగారావు భూ కమిటీ నిర్ధారించింది. అటవీ హక్కుల చట్టం–2006 వచ్చాక ఈ భూములపై హక్కు పత్రాలు ఇవ్వటానికి వైఎస్​ హయాంలో ప్రభుత్వం అంగీకరించి 2008లో 
3 లక్షల ఎకరాలకు పట్టాలిచ్చింది.                       -మూడ్ శోభన్ రాష్ట్ర  సహాయ కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం