
- బీవైడీకి చందనవెల్లిలో 200 ఎకరాలు!
- మేఘా ప్లాంట్‌కు ల్యాండ్ కేటాయించిన సీతారాంపూర్‌కు చేరువలో ఇచ్చేందుకు సర్కారు కసరత్తు
- ఏటా 15 వేల ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేలా మేఘాతో బీవైడీ అగ్రిమెంట్
- కేంద్రం నుంచి అనుమతులు వచ్చేందుకు ఏడాది పట్టే అవకాశం
- ఆ తర్వాత బీవైడీ ప్లాంట్ ఏర్పాటుకు మరో మూడేండ్లు పడుతుందంటున్న అధికార వర్గాలు
హైదరాబాద్, వెలుగు: చైనాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రిక్ కార్ల (ఈవీ) తయారీ సంస్థ బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్)పెట్టుబడులను రాష్ట్రంలో ఏర్పాటు చేసేలా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఆ సంస్థ ప్లాంట్ ఏర్పాటుకు భూమిని కేటాయించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని చందనవెల్లిలో 200 ఎకరాల భూమిని బీవైడీకి కేటాయించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నట్టు ఉన్నతాధికార వర్గాల ద్వారా తెలిసింది.
ఏటా 15 వేల వరకు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసేలా బీవైడీ.. మేఘాతో వంద కోట్ల డాలర్ల ఒప్పందం చేసుకున్నది. అందులో భాగంగా సంస్థ మల్టీ యుటిలిటీ వెహికల్ అయిన ఈ6ను మన రాష్ట్రంలో తయారు చేయనుంది. దానికి సంబంధించి కేంద్రానికి ఇప్పటికే రెండు సంస్థలు ప్రతిపాదనలు కూడా పంపాయి. అయితే, ఆ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అటు చైనా నుంచి..
ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతుల ప్రక్రియ పూర్తయ్యేందుకు సమయం పడుతుందని అంటున్నాయి. సంస్థకు తుది అనుమతులు, ఒప్పందాలు, భూ కేటాయింపులకు మరో ఏడాది పడుతుందని, ఆ తర్వాత సంస్థ ప్లాంట్‌ను స్థాపించేందుకు మరో మూడేండ్లు పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు.
మేఘా ప్లాంట్‌కు అతి చేరువలోనే..
రాష్ట్రంలో ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు మేఘా గ్రూప్‌కు చెందిన ఈవీ తయారీ సంస్థ ఒలెక్ట్రాతో బీవైడీ 2022లోనే ఒప్పందం చేసుకున్నది. అయితే, 2020లో భారత్, చైనా మధ్య జరిగిన గల్వాన్ ఘర్షణతో కేంద్ర ప్రభుత్వం భద్రతా కారణాలను చూపించి 2023లో ఆ ఒప్పందాన్ని తిరస్కరించింది. ప్రస్తుతం వాణిజ్యంపై కేంద్ర ప్రభుత్వం కొంత స్వేచ్ఛనిచ్చి నిబంధనలను సడలించింది.
ఈ నేపథ్యంలోనే మళ్లీ 2 సంస్థల మధ్య పెట్టుబడి ఒప్పందం ఊపందుకున్నది. ఈ క్రమంలోనే ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ సంస్థకు కేటాయించిన సీతారాంపూర్‌లోని 150 ఎకరాల భూమికి అతి చేరువలోనే.. చందనవెల్లిలో బీవైడీకి 200 ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఒలెక్ట్రా తయారు చేసే ఎలక్ట్రిక్ బస్సుల మెయింటెనెన్స్ కోసం మేఘా సంస్థ.
బీవైడీతో 2030 వరకు ఒప్పందం చేసుకున్నది. త్వరలోనే సీతారాంపూర్‌లో మేఘా సంస్థ ఎలక్ట్రిక్ బస్సుల కొత్త మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నదని తెలిసింది. ఈ ఏడాది చివరి నాటికి 5 వేల బస్సులు, వచ్చే ఏడాది చివరి నాటికి మరో 10 వేల బస్సులను రోడ్డుపైకి తీసుకొచ్చేలా మేఘా సంస్థ చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం.