- దేశం, పార్టీ ప్రయోజనాల కోసమేనని వెల్లడి
- డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్‌కు మద్దతు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్టు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రెసిడెంట్ జో బైడెన్ ఆదివారం ఉదయం ప్రకటించారు. దేశం, పార్టీ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ‘‘ఎన్నికల నుంచి మాత్రమే తప్పుకున్నా. ప్రెసిడెంట్ గా పూర్తి పదవీకాలం (2025 జనవరి) కొనసాగుతా. త్వరలోనే జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తా” అంటూ బైడెన్ ట్వీట్ చేశారు.
‘‘ప్రెసిడెంట్ గా మీకు సేవలు అందించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా. కానీ దేశం, పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తప్పుకుంటున్నా. మిగిలిన పదవీకాలంలో పూర్తిగా దేశం కోసం విధులు నిర్వర్తించడంపై మాత్రమే ఫోకస్ పెట్టాలని భావిస్తున్నా” అని ఆయన పేర్కొన్నారు. అయితే, 81 ఏండ్ల బైడెన్ మానసిక ఆరోగ్యంపై సందేహాలు తలెత్తడం, మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామాతో సహా డెమోక్రటిక్ పార్టీ నేతల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
కమలా హారిస్‌కే చాన్స్?
డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పేరును బైడెన్ ప్రతిపాదించారు. ‘‘ప్రెసిడెంట్ అభ్యర్థిగా కమలా హారిస్ కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా. అందరం ఏకతాటిపైకి వచ్చి ట్రంప్ ను ఓడిద్దాం” అని ఆయన డెమోక్రటిక్ నేతలకు పిలుపునిచ్చారు. అయితే, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలను ఆ పార్టీ నేతలు ఆమోదిస్తారా? లేదా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడింకా ఈజీగా గెలుస్త: ట్రంప్
అమెరికా అధ్యక్ష బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు బైడెన్ చేసిన ప్రకటనపై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బైడెన్ తప్పుకోవడంతో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ప్రెసిడెంట్ బరిలో నిలబడతారని ప్రచారం జరుగుతోందని, ఒకవేళ అదే నిజమైతే కమలా హారిస్ ను ఓడించడం తనకు మరింత సులభమని ధీమా వ్యక్తం చేశారు.