మహారాష్ట్రలోని కసబా, చించ్ వాడ్ శాసన సభా స్థానాలకు ఫిబ్రవరి 26న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఎంతో కొంత ప్రభావాన్ని చూపిస్తాయనే ఉద్దేశంతో అన్ని పార్టీలు వీటిని సవాలుగా తీసుకున్నాయి.
శివసేన అధిష్టానాన్ని ధిక్కరించి రాహుల్ కలాటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో కొనసాగుతుండటంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీ తరఫున అశ్విని జగతాప్, ఎన్సీపీ తరఫున నానా కటే పోటీ చేస్తున్నారు. కలాటే 2014లో జరిగిన ఎన్నికల్లో శివ సేన అభ్యర్థిగా పోటీ చేశారు. తర్వాత 2019 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. దివంగత ఎమ్మెల్యే లక్ష్మణ్ జగతాప్ కు 2019 ఎన్నికల్లో కలాటే గట్టి పోటీ ఇచ్చారు. ఆయన లక్ష పన్నెండు వేల ఓట్లు తెచ్చుకున్నారు. కలాటేకే టికెట్ ఇవ్వాలని ఎన్సీపీ భావించింది. కానీ, పార్టీలో అంతర్గత ప్రతిఘటన వల్ల కలాటే బదులు కటేకి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది. నామినేషన్ దాఖలు చేసినపుడు సమర్పించిన పత్రాల్లో కలాటే తనకు మొత్తం58 కోట్ల రూపాయల విలువైన ఆస్తి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయన పుణేలోని బీఎంసీసీ కాలేజీలో బీకామ్ చదువుకున్నారు. కలాటే ప్రత్యర్థి అశ్వినీ జగతాప్ కు మొత్తం రూ.32 కోట్ల విలువైన ఆస్తి ఉంది. మహావికాస్ అఘాడీ తరఫున పోటీ చేస్తున్న విఠల్ ఉర్ఫ్ నానా కటేకి మొత్తం రూ.15 కోట్ల విలువైన ఆస్తి ఉంది.
కసబా పేఠ్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన అభ్యర్థిని ఉపసంహరించుకోవడంతో కసబా నియోజకవర్గంలో ద్విముఖ పోటీ నెలకొంది. బీజేపీ తరఫున హేమంత్ రాస్ నే , కాంగ్రెస్ తరఫున రవీంద్ర ధంగేకర్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఎన్సీపీ, శివసేన(ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాకరే వర్గం)లు మద్దతు ప్రకటించాయి. చనిపోయిన శాసన సభ్యురాలు ముక్తా తిలక్ ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు బాల గంగాధర తిలక్ కుటుంబానికి చెందినవారు. బీజేపీ అభ్యర్థికి బాలాసాహెబ్ బాంచి శివ సేన(ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిందే వర్గం), రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ), రాష్ట్రీయ సమాజ్ పక్ష్ లు మద్దతు ప్రకటించాయి.
మొదలైన ప్రచారం
బీజేపీ, కాంగ్రెస్ లు బ్రహ్మాండమైన రోడ్ షోలతో ఫిబ్రవరి 9న కసబా ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. “గతంలో ఏదో ఒకటి రెండు సందర్భాల్లో తప్పించి కసబా ఓటర్లు ఎప్పుడూ బీజేపీ వైపే మొగ్గు చూపుతూ వస్తున్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితం 2024 అసెంబ్లీ ఎన్నికల తీరును నిర్దేశిస్తుంది కాబట్టి వారు అదే సంప్రదాయాన్ని కొనసాగించాలి” అని మహారాష్ట్ర అటవీ శాఖ మంత్రి సుధీర్ మున్ గంటీవార్ అన్నారు. ఆయన పుణే గార్డియన్ మంత్రి చంద్రకాంత్ పాటిల్ తో కలిసి ఓంకారేశ్వర్ ఆలయ సమీపంలో బీజేపీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తర్వాత శనివార్ పేఠ్, నారాయణ్ పేఠ్, సదాశివ్ పేఠ్ లలో రోడ్ షోలు నిర్వహించారు. “నియోజకవర్గంలోని గడప గడపకూ వెళ్లి నగరాన్ని ఎలా అభివృద్ధి చేయదలచుకున్నదీ వివరిస్తాం” అని హేమంత్రాస్ నే అన్నారు. రాష్ట్రంలో “మార్పుల పవనాలు వీస్తున్నాయి.
కసబా ఉప ఎన్నిక ఫలితం ద్వారా అది మరింత స్పష్టమవుతుంది. ధంగేకర్ కు ప్రజల మద్దతుతోపాటు ఎం.వి.ఏ భాగస్వామ్య పక్షాలన్నింటి మద్దతు లభిస్తోంది” అని కాంగ్రెస్ సీనియర్ లీడర్ సంగ్రామ్ అనంత్ రావ్ థోపటే అన్నారు. పుణేలో ఫిబ్రవరి 18, 19 తేదీల్లో వివిధ కార్యక్రమాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందించిన చారిత్రక థీమ్ పార్క్ శివ్ సృష్టి మొదటి దశను షా ప్రారంభించనున్నారు. సతారా, కొల్హాపూర్ లను కూడా సందర్శించనున్న షా పర్యటనతో బీజేపీ ప్రచారానికి ఊతం లభిస్తుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ముక్తా తిలక్(కసబా), లక్ష్మణ్ జగతాప్ (చించ్ వాడ్)ల మరణంతో ఈ రెండు ఉప ఎన్నికలు అవసరమయ్యాయి. శిండే–-ఫడ్నవీస్ ప్రభుత్వం సానుభూతితో పబ్బం గడుపుకోవాలని చూస్తోంది” అని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన నాయకుడు వసంత్ మోరే వ్యాఖ్యానించారు. ఈ తొందరను పుణే మహా నగర పాలిక ఎన్నికల విషయంలో ఎందుకు చూపించడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఓటమి చెందుతామనే భయంతో పుణే కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం వెనకాడుతోందని ఆయన అన్నారు.
బీజేపీకి అనుకూలమా? ప్రతికూలమా?
ఇటీవల విధాన పరిషత్ కు జరిగిన రెండు ఎన్నికల ఫలితాలు మహారాష్ట్రలో బీజేపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయా? అనే సందేహాన్ని రేకెత్తించాయి. అమరావతి డివిజన్ పట్టభద్రుల నియోజక వర్గం నుంచి రంజీత్ పాటిల్(బీజేపీ), నాగపూర్ డివిజన్ ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి(బీజేపీ మద్దతుతో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన) ఎన్.జి. గానార్ ఓడిపోయారు. అమరావతి గ్రాడ్యుయేట్ నియోజక వర్గానికి చాలా కాలంపాటు ప్రసిద్ధ విద్యావేత్త బి.టి. దేశ్ ముఖ్ ఇండిపెండెంట్ గా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. దాంతో ఆయనను ఓడించడం దాదాపు అసాధ్యమనే అభిప్రాయం ఏర్పడింది. అలాంటిది 2011లో జరిగిన ఎన్నికల్లో రంజీత్ పాటిల్ పెద్ద మెజారిటీతో ఆయనను ఓడించి వార్తలకెక్కారు. తర్వాత, 2017లో జరిగిన ఎన్నికల్లోనూ సంజయ్ ఖోడకే (ఎన్సీపీ)ని కూడా పాటిల్ ఓడించారు. ఇటీవలి ఎన్నికల్లో కూడా ధిరాజ్ లింగడే(ఎం.వి.ఎ)ని పాటిల్ ఓడించగలరని అందరూ భావించారు. కానీ, ఆ అంచనాలను తలకిందులు చేస్తూ లింగడే విజయం సాధించారు. అయితే, ఇది బీజేపీ పట్ల వ్యతిరేకత కాకపోవచ్చనే అభిప్రాయమూ ఉంది.
విధాన పరిషత్ సభ్యుడిగా రెండో విడత పదవీ కాలంలో పాటిల్ పట్టణ ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారని, అట్టడుగు స్థాయి కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారని చెబుతున్నారు. అంతేకాదు, ఈసారి పాటిల్ ను పోటీకి నిలపవద్దని బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో చాలా మంది పార్టీ నాయకత్వానికి జనాంతికంగా సూచించారు. కానీ, ఫడ్నవీస్ కు దగ్గరివాడిగా పాటిల్ కు పేరుండటం వల్ల టికెట్ ఆయననే వరించింది. గెలిస్తే క్యాబినెట్ లో చోటు దక్కవచ్చనే ప్రచారం కూడా సాగింది. కాగా, గత ఏడాది నాగపూర్ పట్టభద్రుల నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి సందీప్ జోషీ ఓడినా, బీజేపీ దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్లు లేదు. ఆర్ఎస్ఎస్ కేంద్ర స్థానం, ఫడ్నవీస్, బావన్ కులేల సొంత పట్టణమైన నాగపూర్ లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించడం విశేషమేమరి. తాజాగా, చించ్ వాడ్, కసబా ఉప ఎన్నికల ఫలితాలతో ప్రజానాడి మరింతగా ప్రస్ఫుటమయ్యే అవకాశం ఉంది.
- మల్లంపల్లి ధూర్జటి, సీనియర్ జర్నలిస్ట్