- బెంగాల్‌లో టీఎంసీ,కర్నాటకలో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్
- యూపీలో ఏడు చోట్ల బీజేపీ.. రెండు సీట్లలో ఎస్పీ విజయం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల హవా కొనసాగింది. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 9 అసెంబ్లీ స్థానాలకు బైపోల్స్ జరిగాయి.
ఇందులో ఆరు స్థానాలు బీజేపీ గెలుచుకుంది. ఎస్పీ రెండు చోట్ల విజయం సాధించాయి. రాష్ట్రీయ లోక్ దళ్ ఒక సీటు దక్కించుకుంది. ఆర్ఎల్డీ పార్టీ బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలోనే ఉండడంతో మొత్తం 9 సీట్లలో 7 అధికార కూటమి గెలుచుకుంది. రాజస్థాన్‌లో 7 అసెంబ్లీ సీట్లకు బైపోల్ జరగ్గా 6 స్థానాలు బీజేపీ, ఒక స్థానం కాంగ్రెస్ గెలుపొందింది.
పశ్చిమ బెంగాల్‌లో 6 అసెంబ్లీ స్థానాలకు బైపోల్స్ జరగగా, అన్ని సీట్లు అధికార టీఎంసీ దక్కించుకుంది. అస్సాంలో 5 స్థానాలకు బీజేపీ 3, అస్సాం గణ పరిషత్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ(లిబరల్) చెరో స్థానం దక్కించుకున్నాయి.
4 సీట్లకు బైపోల్స్ జరిగిన పంజాబ్‌లో ఆప్ 3, కాంగ్రెస్ ఒక సీటు సీటును గెలుచుకున్నాయి. బిహార్‌లో 4 స్థానాలకు గాను బీజేపీ 2 చోట్ల, జనతాదళ్ (యునైటెడ్)(జేడీయూ) ఒక సీటు, హిందుస్థానీ ఆవామ్ మోర్చా(సెక్యులర్) ఒక సీటు దక్కించుకున్నాయి.
కర్నాటకలో జరిగిన మూడు స్థానాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. మాజీ సీఎం, కేంద్రమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ ఓడిపోయారు. మధ్యప్రదేశ్‌లోని 2 అసెంబ్లీ సీట్లలో ఒక స్థానం కాంగ్రెస్, మరొకటి బీజేపీ గెలిచాయి.
కేరళలో పాలక్కాడ్ అసెంబ్లీ సీటును కాంగ్రెస్.. చెలక్కర స్థానంలో సీపీఎం విజయం సాధించాయి. సిక్కిం లో 2 సీట్లను సిక్కిం క్రాంతికారి పార్టీ గెలుచుకుంది. ఒక్కో అసెంబ్లీ సీటుకు ఉప ఎన్నికలు జరిగిన ఉత్తరాఖండ్, గుజరాత్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ అభ్యర్థులు, మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ గెలుపొందింది.
మోదీపై నమ్మకానికి నిదర్శనం: యోగి
యూపీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనమని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ అన్నారు.
అవినీతికి పర్యాయపదం: అఖిలేశ్
యూపీలో జరిగిన ఉపఎన్నికలు చరిత్రలోనే అత్యంత వక్రీకరణకు గురైన ఎన్నికల రాజకీయాలని ఈ దేశానికి.. మొత్తం ప్రపంచానికి చాటాయని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఎన్నికలను అవినీతికి పర్యాయయ పదంగా మార్చారని ఆరోపించారు.