న్యూఢిల్లీ : ఒకప్పుడు 22 బిలియన్ డాలర్లు (సుమారు రూ.1.83 లక్షల కోట్లు) పలికిన ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ విలువ ప్రస్తుతం సున్నాకు పడిపోయిందని కంపెనీ ఫౌండర్ బైజూ రవీంద్రన్ ఒప్పుకున్నారు. ‘దీని విలువ జీరో. ఏ వాల్యుయేషన్స్ గురించి మాట్లాడుతున్నారు? దీని విలువ జీరో ఇప్పుడు’ అంటూ ఆయన డైరెక్ట్‌గా తేల్చేశారు. బైజూస్ విస్తరణపై స్పందిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఎడ్‌టెక్ సెక్టార్‌లో విస్తరించేందుకు 24 స్టార్టప్‌లను బైజూస్ కొనుగోలు చేసింది.
కానీ, ఈ ప్లాన్సే కంపెనీ కొంపముంచాయి. బైజూస్ 2022లో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. 40 కొత్త మార్కెట్లలో విస్తరించాలని కంపెనీ ఇన్వెస్టర్లు ప్రోత్సహించారని, ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో ఈ ప్లాన్స్‌కు బ్రేక్ పడిందని అన్నారు. చిన్న సమస్య రాగానే బైజూస్ ఇన్వెస్టర్లు ప్రోసస్ వెంచర్స్, పీక్ ఎక్స్‌వీ, చాన్ జూకర్బర్గ్ ఇనీషియేటివ్ పారిపోయారని అన్నారు. ఇండియా నుంచి పారిపోలేదని, తన తండ్రి ట్రీట్‌మెంట్ కోసం దుబాయ్ వచ్చానని రవీంద్రన్ అన్నారు. బైజూస్‌ను ఎప్పటికైనా తిరిగి గాడిలో పెడతానని చెప్పారు.