Healthy Food: మీ చిప్స్​ మీరే తెచ్చుకోండి.. కొత్త ట్రెండ్

చాలామంది రోజులో కనీసం ఒక్కసారైనా చిప్స్​ తింటుంటారు. అలాంటి వాళ్లకోసం ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్​ మొదలైంది. అదేంటంటే.. చిప్స్​ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని తెలిసి.. దాన్ని బ్యాలెన్స్​ చేసేందుకు వెజిటబుల్‌‌ టాపింగ్స్​తో తింటున్నారు.

అందుకే కొన్ని రెస్టారెంట్లలో కూడా చిప్స్​లో టాపింగ్స్​ కలిపి ఇచ్చేందుకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ట్రెండ్​ని BYOC (బ్రింగ్ యువర్ ఓన్ బ్యాగ్​ ఆఫ్​ చిప్స్) అంటే నచ్చిన చిప్స్​ ప్యాకెట్​ని రెస్టారెంట్​కి తీసుకెళ్తే.. అందులో మనం సెలెక్ట్‌‌ చేసుకున్న రకరకాల టాపింగ్స్​, సాస్‌‌లు వేసి బాగా మిక్స్​ చేసి ఇస్తారు. ముఖ్యంగా తరిగిన టమోటాలు, ఉల్లిపాయలు, బెల్ పెప్పర్స్, జలపెనోస్, చికెన్, గ్వాకామోల్, సల్సా, సోర్ క్రీం,  మయోనీస్ లాంటి వాటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

ఇలా టాపింగ్​ చేసి ఇచ్చినందుకు రెస్టారెంట్లు రూ.200 వరకు చార్జ్​ చేస్తున్నాయి. కొన్ని రెస్టారెంట్లలో చిప్స్​ కూడా వాళ్లే ఇస్తున్నారు. ఈ ట్రెండ్​ ఇదివరకు ఫారిన్​లో ఉండేది. ఈ మధ్యే ఇండియాలో వైరల్​ అవుతోంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, సూరత్‌‌లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే హైదరాబాద్​లో కూడా మొదలవుతోంది. ప్రీమియం రెస్టారెంట్లతో పాటు స్ట్రీట్ ఫుడ్ అమ్మేవాళ్లు కూడా తమ కస్టమర్లకు ఈ సర్వీస్​ అందిస్తున్నారు. 

హెల్దీ ఫుడ్​గా మారిపోతుందా? 

చిప్స్‌‌లో ఫ్రెష్​ వెజిటబుల్స్​, చికెన్‌‌, పనీర్​ లాంటివి వేసుకుంటే అది ఆరోగ్యకరమైన ఫుడ్​గా మారిపోతుందని చాలామంది అనుకుంటారు. అయితే.. ‘‘లీన్ ప్రొటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు, హెల్దీ ఫ్యాట్స్​ తీసుకోవడం వల్ల కొంత మొత్తంలో విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్‌‌ అందుతాయి. కానీ.. వాటితోపాటు తినే చిప్స్​, సాస్‌‌లు, మయోనీస్‌‌ ఆరోగ్యం మీద చెడు ప్రభావం చూపిస్తాయి.

వాటిని చాలారోజులు నిల్వ ఉంచేందుకు ఎక్కువ ఉప్పు, ప్రిజర్వేటివ్స్​ కలుపుతుంటారు. వాటిలో ఎక్కువ షుగర్​, అనారోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయ”ని  డైటీషన్లు చెప్తున్నారు. వాటివల్ల మధుమేహం​, గుండె జబ్బులు లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.