కేసీ‌ఆర్ జాతీయ పార్టీ ప్రకటనతోనే మునుగోడు బైపోల్ షెడ్యూల్

  • పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్లే ఉప ఎన్నిక ప్రకటన వాయిదా వేయించిన్రు

సూర్యాపేట, వెలుగు: జాతీయ రాజకీయాల్లోకి వస్తామంటూ సీఎం కే‌సీఆర్ ప్రకటించిన 24 గంటల్లోనే మునుగోడు బైపోల్  నోటిఫికేషన్ వెలువడిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. తమ గెలుపును ఆపడం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాల తరం కాదన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రకటన వెలువడిన నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో  మీడియాతో ఆయన మాట్లాడారు. జాతీయ పార్టీ ప్రకటనతో కమలనాథులు బెంబేలెత్తిపోతున్నారని అన్నారు. అమిత్ షా మునుగోడు పర్యటన ముగిసిన మరుసటి రోజే ఎన్నికల ప్రకటన వస్తుందని భావించామని, అయితే పరిస్థితులు బీజేపీకి ఆశాజనకంగా కనిపించకపోయేసరికి  బైపోల్ ప్రకటనను వాయిదా వేయించారని ఆరోపించారు.  నిజానికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన మరుక్షణమే అక్కడి ప్రజలు టీఆర్ఎస్ ను గెలిపించాలని నిర్ణయించారన్నారు. మునుగోడు లో బీజేపీకి దక్కేది మూడో స్థానమేనని, తమకు కాంగ్రెస్ నుంచే పోటీ అని పేర్కొన్నారు. కాగా మునుగోడుకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు సోమవారం జగదీశ్ రెడ్డి సమక్షంలో టీ‌ఆర్‌ఎస్ లో చేరారు. 

బతుకమ్మ స్ఫూర్తితో ప్రకృతిని కాపాడుకుందాం

బతుకమ్మ పండుగను అధికారంగా జరుపుకోవడం, బతుకమ్మ చీరల పంపిణీ తెలంగాణ ఆడబిడ్డలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని మంత్రి  జగదీశ్ రెడ్డి, ఎస్ ఫౌండేషన్ చైర్మన్ సునీతా జగదీశ్ రెడ్డి  అన్నారు. తన క్యాంప్ ఆఫీస్ లో సద్దుల బతుకమ్మ సందర్భంగా మంత్రి  మాట్లాడారు. బతుకమ్మ స్ఫూర్తితో ప్రకృతిని, పచ్చదనాన్ని, నీటి వనరులను కాపాడుకుందామని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.