కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును విశాఖలో పెట్టాలన్న ఏపీ సీఎం జగన్ నిర్ణయంపై రాయలసీమలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అధ్వర్యంలోని రాయలసీమ స్టీరింగ్ కమిటీ కేఆర్ఎంబీ చైర్మన్ను కలిసింది. కేఆర్ఎంబీ కార్యాలయాన్ని విశాఖకు తరలించడాన్ని వ్యతిరేకిస్తూ వినతి పత్రం అందజేశారు. కేఆర్ఎంబీ కార్యాలయాన్ని కర్నూలులో పెడితే అందరికీ అందుబాటులో ఉంటుందన్న ఆయన కృష్ణా నదికి వైజాగ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్న సిద్దార్థ్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. సిద్ధార్థ్ రెడ్డి ఓ పిల్ల కాకి అని విమర్శించారు. అటువంటి వ్యక్తుల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఉన్న ఏపీని జగన్ సర్కార్ బెగ్గింగ్ బౌల్గా మార్చిందన్నారు. అమెరికా ప్రెసిడెంట్ వచ్చినా ఏపీని బాగుచేయలేడని వ్యాఖ్యానించారు.