అభివృద్ధి పేరుతో యాదగిరిగుట్టను ఆగం చేసిన్రు : బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, వెలుగు: గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో యాదగిరిగుట్టను ఆగం చేసిందని  ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య విమర్శించారు.   లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో  స్థానికుల అభిప్రాయాలు తీసుకోకపోవడంతోనే భక్తులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని మండిపడ్డారు. శనివారంస్వయంభూ నారసింహుడిని దర్వించుకున్నారు.

అనంతరం కొండపై కలియ తిరిగి భక్తుల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులను ఆరా తీశారు. తర్వాత కొండకింద రోడ్డు వెడల్పులో దుకాణాలు కోల్పోయిన 135 మందికి వైటీడీఏ సేకరించిన స్థలంలో నిర్మించిన షాపులకు సంబంధించిన పొజిషన్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆలయ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. గత ప్రభుత్వం నిర్వాకం కారణంగా డార్మిటరీ హాల్‌‌‌‌తో పాటు కొబ్బరికాయలు కొట్టేందుకు ప్లేస్ కూడా లేకుండా పోయిందన్నారు.

  ఆలయ పునర్నిర్మాణంలో భూములు, ఇండ్లు, షాపులు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.  వారంలోగా భక్తులు కొండపై నిద్ర చేసేందుకు వీలుగా..  500 మంది పడుకునే విధంగా తాత్కాలిక డార్మిటరీ హాల్‌‌‌‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. కొబ్బరికాయలు కొట్టేందుకు ఏర్పాట్లు చేస్తామని,  కొండపైన కూడా షాపులు  ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.  

త్వరలోనే కొండపైకి ఆటోలను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రెడ్డి, ఆర్డీవో అమరేందర్, జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకలసుధా హేమేందర్ గౌడ్, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఆలయ ఈవో రామకృష్ణారావు, డిప్యూటీ తహశీల్దార్ నరసింహరావు, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఆర్ అండ్ బీ ఈఈ వెంకటేశ్వర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, రెవెన్యూ సిబ్బంది, ఆలయ ఏఈవోలు, ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.