
- కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చర్చకు సిద్ధమా: పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
- శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్
- అన్ని రంగాల్లో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నదని ఫైర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు గడిచిన 11 ఏండ్లలో బీజేపీ ఏం చేసిందో చర్చకు సిద్ధమా..? అని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. సోమవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం కేంద్రం, బీజేపీ ఏం చేశాయో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీల 42 శాతం రిజర్వేషన్లను 9 వ షెడ్యూల్ లో చేర్చేలా తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు చొరవ తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్రం నుంచి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని మోదీని కల్పించి బీసీలకు న్యాయం చేయాలని కేంద్ర మంత్రులను కోరారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడం బీజేపీ లక్ష్యమని చెబుతున్న మీరు.. తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన కులగణను ఆదర్శంగా తీసుకొని దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టి మీ నిజాయతీని నిరూపించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంపై వివక్ష చూపుతూ అన్ని రంగాల్లో అన్యాయం చేస్తున్నదని విమర్శించారు.
బీజేపీకి చాన్స్ ఎందుకివ్వాలి?
తెలంగాణలో బీజేపీకి ఒక్క చాన్స్ ఇవ్వాలంటూ కిషన్ రెడ్డి ప్రాధేయపడడంపై మహేశ్‌కుమార్‌గౌడ్ మండిపడ్డారు. లౌకికవాదాన్ని నమ్ముకున్న తెలంగాణ ప్రజలు బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో ఆదరించరని స్పష్టం చేశారు. మతసామరస్యానికి ప్రతీక అయిన తెలంగాణలో మతతత్వ బీజేపీకి అధికారం పగటి కలనే అన్నారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాలు, నిధుల విడుదలలో అన్యాయం చేస్తున్నందుకు మీకు అవకాశం ఇవ్వాలా.. రాష్ట్రానికి 11 ఏండ్లుగా అన్నింట్లో గుండు సున్నా ఇస్తున్నందుకు మీకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలా.. అని ప్రశ్నించారు.
అమిత్‌షా పర్మిషన్ లేనిదే సంజయ్ టిఫిన్ కూడా చేయడు
విభజన హామీల గురించి బండి సంజయ్, కిషన్ రెడ్డి కేంద్రంతో ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పులు మోసిన ఘటన మరిచిపోయారా..? అన్నారు. మోదీ, అమిత్ షా పర్మిషన్ లేనిదే సంజయ్ టిఫిన్ కూడా చేయలేడని విమర్శించారు.
బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు రాష్ట్రానికి తెచ్చిన నిధులు గుండు సున్నా అని ఎద్దేవా చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం యుమనా నదికి నిధులు కేటాయించిన కేంద్రం, హైదరాబాద్ మెట్రో, మూసీ రివర్ ను ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం పంపిణీని చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
మీనాక్షి నటరాజన్ రివ్యూ చేశారనడం అబద్ధం
హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఖ్యా బలం లేకపోయినా బీజేపీ ఎవరి అండ చూసుకుని అభ్యర్థిని నిలబెట్టిందని మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. తమకు సంఖ్యా బలం లేకపోవడంతోనే అభ్యర్థిని నిలబెట్టేలేదని, మజ్లిస్ కు మద్దతు ఇచ్చే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. హెచ్‌సీయూ భూముల అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సెక్రటేరియట్ లో కూర్చొని మంత్రులతో రివ్యూ చేశారనేది అబద్ధమన్నారు.
మీనాక్షి నటరాజన్ అనుమతితోనే తాను సొంత ఊరికి వెళ్లానని, తనను సమావేశాలకు రావద్దని ఆమె అన్నట్లు జరగుతున్న ప్రచారం తప్పు అని అన్నారు. హెచ్‌సీయూలో జింకలు ఉన్నాయనేది వాస్తవం కాదని అన్నారు. నెమళ్లు ఎక్కడైనా ఉండొచ్చని, ఢిల్లీలో బండి సంజయ్ ఇంట్లో కూడా నెమళ్లు ఉన్నాయని అన్నారు.