CAA ఆందోళనలు ఎవరి కోసం?

గాంధీ, నెహ్రూ వారసులమని 70 ఏళ్లుగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు… వారి అడుగు జాడల్లో ఏనాడూ నడవలేదు. గొప్పవాళ్ల ఆశయాలు ఆచరణలోకి వస్తున్నప్పుడు నిజమైన వారసులు ఆనందిస్తారు. నిర్ణయాలను ఆహ్వానిస్తారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంకా ఏ మొహం పెట్టుకుని గాంధీ, నెహ్రూ వారసులమని చెప్పుకుంటారు! బ్రిటిషర్ల పాలన నుంచి బయటపడిన తర్వాత ప్రపంచ శక్తిగా ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ… కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల అర్థం లేని విధానాలవల్ల సాధ్యపడలేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు… దేశ అభివృద్ధి కోసం కాకుండా స్వార్థ ప్రయోజనాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేశాయి. దేశంలో చాలా కీలక అంశాలు ఎంతోకాలంగా పరిష్కారం కాకుండా మిగిలిపోయాయి. దశాబ్దాలుగా పెండింగ్​లో ఉన్న ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్, సీఏఏ వంటి అంశాలను జాతి ప్రయోజనాలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఒక్కొక్కటిగా  పరిష్కరిస్తోంది.

దేశమే కుటుంబం అనుకొని పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ… భావి తరాల బంగారు భవిష్యత్తు కోసం చారిత్రక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ తీసుకోలేని నిర్ణయాలు ఇప్పుడు కార్యరూపం దాల్చుతుంటే, అసాధ్యం అనుకున్న అంశాలు సుసాధ్యం అవుతుంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఒక చేతగాని పార్టీగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడే పార్టీలన్నీ సంఘ విద్రోహ శక్తులుగా, అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలకు దిగుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, మజ్లిస్​, లెఫ్ట్​ పార్టీలు సీఏఏను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయో సరైన కారణం ఒక్కటైనా చెప్పడం లేదు. చట్టంలో ముస్లిం అనే పదాన్ని కూడా చేర్చాలని, చేర్చకపోవడం రాజ్యాంగ విరుద్ధమని ఆయా పార్టీల నేతలు వాదిస్తున్నారు.

పొరుగు దేశాల్లో హింసకు, అణచివేతకు, వివక్షకు గురయి శరణార్ధులుగా భారతదేశానికి వచ్చే మైనార్టీలను అక్కున చేర్చుకోవడం కోసం తీసుకొచ్చిన చట్టంలో… ‘ముస్లిం’ అనే పదాన్ని కూడా చేర్చాలని డిమాండ్ చేయడం అర్థం లేనిది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ దేశాల్లో ముస్లింలు మైనార్టీలు కాదు అనే కనీస పరిజ్ఞానం కాంగ్రెస్, టీఆర్​ఎస్, మజ్లిస్​, లెఫ్ట్​ నేతలకు లేకుండాపోయింది.

రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నిజాం వారసులైన మజ్లిస్​ పార్టీకి గులాంగిరీ చేస్తోంది. దశాబ్దాలుగా వివిధ పార్టీలు ఓటు బ్యాంకు కోసం మజ్లిస్​కి లిఫ్ట్ ఇస్తే… టీఆర్ఎస్ ఏకంగా పాలన స్టీరింగ్ అప్పగించింది. టీఆర్ఎస్ కారు స్టీరింగ్ తమ చేతుల్లో ఉందని స్వయంగా అక్బరుద్దీన్ ఒవైసీ చెప్పిన మాట వాస్తవం కాదా? ఈ విషయాన్ని టీఆర్ఎస్ ఖండించలేదు. అంటే అక్బరుద్దీన్ వ్యాఖ్యల్ని ఒప్పుకోవడమే కదా?

‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ నినాదంతో దేశాభివృద్ధి కోసం బీజేపీ పాటు పడుతోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్, మజ్లిస్​, లెఫ్ట్​ పార్టీలు ఒక వర్గం ప్రయోజనం కోసమే మాట్లాడుతున్నాయి. ఎవరు నిజమైన సెక్యులర్​వాదులో, ఎవరు నిజమైన ప్రజాస్వామ్యవాదులో యావత్ దేశం గమనిస్తోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలలో సీఏఏకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు జరుగుతున్నాయి. తెలంగాణలోనూ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా  కాంగ్రెస్, టీఆర్ఎస్, మజ్లిస్​, లెఫ్ట్​ పార్టీలు కుట్ర పన్నుతున్నాయి. మహా కూటమి పేరుతో ఆందోళనకు పథక రచన చేశారు. ఈ ఆందోళనల్ని దీటుగా ఎదుర్కోవడానికి జాతీయవాదులంతా సిద్ధంగా ఉండాలి.

స్వాతంత్ర్యం సిద్ధించిన నాడు అఖండ భారత దేశ విభజన మత ప్రాతిపదికన జరిగిన విషయం చారిత్రక వాస్తవం. ఆనాడు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఈ విషయాన్ని అంగీకరించిన విషయం కూడా చారిత్రక సత్యం. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్ దేశాలు ఇస్లాం రిపబ్లిక్​లుగా ప్రకటించుకుని అక్కడి మైనార్టీలను అవస్థలకు గురి చేసిననాడు, మైనారిటీలు అక్కడ దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొన్ననాడు… ప్రస్తుతం ఆందోళనలు చేస్తున్న ఏ పార్టీ చిత్తశుద్ధితో స్పందించలేదు. ఆ విషయం దేశ ప్రజలకు తెలుసు.

సిటిజెన్​షిప్​ ఎమెండ్​మెంట్​ యాక్ట్​ని అమలు చేస్తే… భారతదేశంలోని ముస్లింల పౌరసత్వం తొలగిస్తారనే అసత్య ప్రచారం చేస్తూ అభద్రతా భావాన్ని కలిగిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయి. ఈ పార్టీలన్నీ చరిత్రహీనులుగా మిగిలిపోక తప్పదు. గతంలోనూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆయా పార్టీలు… శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించాలని చట్టసభల్లో ప్రసంగాలు చేయడం, తీర్మానాలు చేయడం వాస్తవం కాదా? దేశంలో నరేంద్ర మోడీ, అమిత్ షా నేతృత్వంలో తిరుగులేని విజయాలు సాధిస్తున్నాయి. ఈ సమయంలో వివిధ పార్టీలు అనుసరిస్తున్న రెండు రకాల వైఖరిని ప్రజలంతా గమనిస్తున్నారు.

భారత, పాకిస్థాన్ దేశాలలోని మైనార్టీల రక్షణ కోసం… 1950లో అప్పటి ఇరు దేశాల ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, లియాఖత్ అలీ మధ్య కుదిరిన ఒప్పందాన్ని నేటి కాంగ్రెస్ నాయకత్వం అంగీకరిస్తుందా లేదా? ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాత సిటిజెన్​షిప్​ ఎమెండ్​మెంట్​ యాక్ట్​పై స్పందించాలి. ఈ చారిత్రక సమయంలో దేశంలోని ప్రజలు, విజ్ఞులు, స్టూడెంట్లు, యువత, విద్యావంతులు, మేధావులు, జాతీయవాదులు, జాతి హితం కోరుకునే పార్టీలు, దేశం కోసం ధర్మం కోసం పాటుపడే సంస్థలు… ఒక్కటి కావలసిన సమయం ఆసన్నమైంది. ఈ చట్టంపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.

సీఏఏ ఎవరికీ హాని చేయదు

సిటిజెన్​షిప్​ ఎమెండ్​మెంట్​ యాక్ట్​కి ఓ చారిత్రక నేపథ్యం ఉంది. 1947లో భారత్ నుంచి విడిపోయి ప్రత్యేక దేశాలుగా ఏర్పడిన దేశాలు ఇస్లాం మత రాజ్యాలుగా ప్రకటించుకున్నాయి. ఆయా దేశాల్లో నివసిస్తున్న మైనార్టీ వర్గాలు వివక్షకు, నిర్బంధానికి గురై… మాన, ప్రాణ రక్షణ కోసం మన దేశాన్ని ఆశ్రయిస్తున్నారు. చాలామంది దశాబ్దాలుగా మన దేశంలో నివసిస్తున్నప్పటికీ వారికి పౌరసత్వం లభించని విషయం గుర్తించాలి. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం శరణార్థుల పట్ల మానవతా దృక్పథంతో పౌరసత్వం కల్పించేందుకు సీఏఏ తీసుకొచ్చింది. ఈ సవరణ చట్టంతో చాలామంది ఊరట పొందనున్నారు. పౌరసత్వ సవరణ చట్టం వల్ల దేశంలో నివసిస్తున్న ఏ మతానికి చెందిన ప్రజల పైనా ఎలాంటి ప్రభావం చూపదు.

For More News..

మేకలమ్మితే రూ. 1.32 కోట్లు

బయటి దేశాల్లో మనోళ్ల రాజకీయం

కొన్నది 25 వేలకి.. అమ్మితే వచ్చేది 5 కోట్లు