రూ.400 కోసం క్యాబ్ ​డ్రైవర్ ​హత్య.. కత్తులతో పొడిచిన యువకులు

రూ.400 కోసం క్యాబ్ ​డ్రైవర్ ​హత్య.. కత్తులతో పొడిచిన యువకులు
  • ఢిల్లీలో నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపిన యువకులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. ఓ క్యాబ్​ డ్రైవర్​ రూ.400 చార్జి అడిగినందుకు ఐదుగురు యువకులు నడిరోడ్డుపై కత్తితో పొడిచి చంపారు. ఈశాన్య ఢిల్లీలోని సోనియా విహార్​ఏరియాలో ఈ నెల 17 అర్ధరాత్రి ఈ ఘోరం చోటు చేసుకుంది. పుస్తా సమీపంలో రక్తం మడుగులో పడి ఉన్న ట్యాక్సీ డ్రైవర్ సందీప్​ సోనియాను పోలీసులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీపాన్షు అలియాస్​ అషు, రాహుల్, మయాంక్​ను నోయిడానుంచి సందీప్ తన క్యాబ్​లో తీసుకొచ్చాడు. 

పుస్తా 2కు చేరుకున్నాక రూ.400 చార్జ్​ అడిగాడు. దీంతో వారిమధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ సమయంలో దీపాన్షు​ సహచరుల్లో ఒకరైన నిఖిల్, మరో మైనర్ సందీప్ తల, పొత్తికడుపుపై కత్తితో పొడిచారు. అనంతరం చికిత్స పొందుతూ సందీప్‌‌‌‌ మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ప్రతీక్​ పేరుతో నిందితులు క్యాబ్​ను బుక్​ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ప్రతీక్​ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని, విచారించారు. ఈ నెల 17న దీపాన్షు, రాహుల్, మయాంక్, నిఖిల్, ఓ మైనర్​తో కలిసి మద్యం తాగినట్టు ప్రతీక్ వెల్లడించాడు. అనంతరం దీపాన్షు, రాహుల్, మయాంక్​కు పుస్తాకు క్యాబ్​ బుక్​ చేసినట్టు తెలిపాడు.