
ఓలా, ఉబెర్, ర్యాపిడో.. తదితర క్యాబ్ డ్రైవర్స్ కు ఫేవరెట్ రైడ్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్. సిటీ నుంచి రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ కు ఒక్క ట్రిప్ పడినా ఆ రోజుకు కొంత గిట్టుబాటు అవుతుందని అనుకుంటారు. ఎయిర్ పోర్ట్ రైడ్ వస్తే వెంటనే యాక్సెప్ట్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ‘‘వామ్మో.. శంషాబాదా..? మేం రాం’’ అనే పరిస్థితి ఏర్పడింది. ఎయిర్ పోర్ట్ అంటేనే డ్రైవర్స్ రైడ్ క్యాన్సిల్ చేసే పరిస్థితి ఎందుకొచ్చింది..?
దీనికి కారణం ప్రస్తుతం ఉన్న ధరలు (ఫేర్ స్ట్రక్చర్) తమకు లాభం ఇవ్వడం లేదని వాపోతున్నారు. సిటీ ట్రాఫిక్ ను దాటి ఎయిర్ పోర్ట్ కు అంత దూరం వెళ్తే ఈ మధ్య ఏం గిట్టుబాటు కావడం లేదని ఆందోళన చెందుతున్నారు. అందులో ట్రిప్ మొత్తం ఏసీ ఆన్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. దీంతో ఆపరేషన్ కాస్ట్ పెరుగుతోందని, కానీ కంపెనీలు ఇచ్చే రేట్లేమో తమకు గిట్టుబాటు కావడం లేదని అంటున్నారు.
అందుకోసం ఇకనుంచి ‘నో ఏసీ’ క్యాంపెయిన్ చేసేందుకు సిద్ధమయ్యారు. అంతదూరం ఏసీ ఆన్ చేసి వెళ్లడం ద్వారా ఫుయెల్ చాలా ఎక్కువ ఖర్చు అవుతోందని, తమకొచ్చే రేట్లను బట్టీ ఏసీ లేకుండా రైడ్ చేయటానికైతే ఒప్పుకుంటామని స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణ గిగ్, ప్లాట్ ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ ఈ వివాదంపై స్పందించాడు. ‘‘సిటీలో దాదాపు 40 వేల క్యాబ్ డ్రైవర్స్ పనిచేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ ట్రిప్స్ ను బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్నారు. మాకు ఇప్పుడున్న ధరలు గిట్టుబాటు కావడం లేదని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పెంచడం లేదు’’ అని తెలిపాడు.
అయితే ప్రీపెయిడ్ ట్యాక్స్ లకు మాత్రమే అమలు చేస్తూ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ఉత్తర్వులు ఇచ్చిందని, అది అన్ని రకాల క్యాబ్స్ కు వర్తింపజేయాలని కోరుతున్నట్లు యూనియన్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే క్యాబ్ డ్రైవర్స్ నిర్ణయంతో చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం వీలైనంత తొందరగా పరిష్కారం చూపకపోతే.. సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.