Good Food: కమ్మని క్యాబేజీతో వేడి వేడి సూప్, టేస్టీ ఆమ్లేట్, వడలు ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..!

Good Food:  కమ్మని క్యాబేజీతో వేడి వేడి సూప్, టేస్టీ ఆమ్లేట్, వడలు ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..!

క్యాబేజీ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. అయితే, ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రెగ్యులర్ కర్రీల్లా కాకుండా కొంచెం డిఫరెంట్​ గా  చేసుకుంటే క్యాబేజీని లాగించొచ్చు. అలాంటి వెరైటీలే ఈ సూప్, ఆమ్లెట్, కర్రీలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం..


క్యాబేజీ  ఓట్స్ ఆమ్లెట్  తయారీకి కావలసినవి 

  • ఓట్స్: ఒక కప్పు
  •  క్యారెట్ తురుము: అర కప్పు 
  • క్యాబేజీ తురుము: అర కప్పు 
  • మిరియాల పొడి: ఒక టీ స్పూన్ 
  • కోడిగుడ్లు: 3
  • చీజ్: అర కప్పు
  • వెన్న: కొంచెం 
  • ఉప్పు: తగినంత 


తయారీ : స్టవ్ మీద పాన్ పెట్టి ఓట్స్ దోరగా వేయించాలి. ఒక గిన్నెలో క్యారెట్, క్యాబేజీ తురుము, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. అందులోనే కోడిగుడ్ల మిశ్రమం వేసి మరోసారి బాగా కలపాలి. ఇందులోనే వేగించిన ఓట్స్, చీజ్ వేసి కలపాలి. తర్వాత పాన్లో నూనె వేసి కొద్దిగా వెన్న కరిగించి ముందుగా చేసుకున్న మిశ్రమాన్ని అమ్లెట్​ గా  పరచాలి. ఆమ్లెట్ మీద కొంచెం చీజ్ వేయాలి. మూడు నిమిషాల తర్వాత ఆమ్లెట్ తిప్పి దాని మీద క్యారెట్, చీజ్ చల్లి మూత పెట్టాలి. ఐదు నిమిషాల తర్వాత ప్లేట్లోకి తీసుకొని కావాల్సిన సైజ్లోకట్ చేసుకుంటే ఓట్స్ క్యాబేజీ ఆమ్లెట్ సిద్ధం..

క్యాబేజీతో పెసరపప్పు వడ తయారీకి కావలసినవి

  •  పెసరపప్పు : ఒక కప్పు
  • క్యాబేజీ తురుము: ఒక కప్పు
  • పచ్చిమిర్చి: మూడు
  •  జీలకర్ర: అర టీ స్పూన్
  •  కరివేపాకు: ఒక రెమ్మ
  •  కొత్తిమీర: అర కప్పు
  • నూనె: వేగించడానికి
  • ఉప్పు: తగినంత 

తయారీ : పెసరపప్పుని ముందుగా నాలుగు గంటలు నానబెట్టాలి. తర్వాత పెసరపప్పు, జీలకర్ర, ఉప్పు, పచ్చిమిర్చి కలిపి గ్రైండ్ చేయాలి. క్యాబేజీని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. గ్రైండ్ చేసిన పెసరపప్పు మిశ్రమంలో క్యాబేజీ, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా తీసి వడలుగా చేయాలి. ఇప్పుడు పాన్లో నూనె వేసి వడలను గోధుమ రంగులోకి వచ్చే వరకు వేగించాలి. ఈ వడలను నేరుగా తిన్నా, ఏదైనా చట్నీతో తిన్నా బాగుంటాయి.

క్యాబేసీ సూప్  తయారీకి కావాల్సినవి 

  • క్యాబేజీ తురుము: ఒక కప్పు
  • వెల్లుల్లి: రెండు రెబ్బలు
  • ఉల్లిపాయ: ఒకటి
  •  ఆలివ్ ఆయిల్: ఒక టేబుల్ స్పూన్
  •  టొమాటో గుజ్జు: ఒక కప్పు 
  • ఉప్పు: తగినంత 

తయారీ : క్యాబేజీ, వెల్లుల్లి, ఉల్లిపాయని సన్నగా తరిగి పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ పాన్ పెట్టి ఆలివ్ ఆయిల్ వేసి వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేగించాలి. తర్వాత క్యాబేజీ తరుము వేసి రెండు నిమిషాలు వేగించాలి. అందులోనే మిరియాల పొడి, ఉప్పుతో పాటు కొద్దిగా నీళ్లు పోసి పదిహేను నిమిషాలు ఉడికించాలి.. చివరిగా టొమాటో గుజ్జు వేసి పది నిమిషాలు ఉడికిస్తే క్యాబేజీ సూప్ రెడీ