ఇక కొత్త రేషన్ కార్డులు

  •     విధివిధానాలకు సబ్​ కమిటీ 
  •     ప్రజల్లో చిగురించిన ఆశలు
  •     యాదాద్రి జిల్లాలో 11 వేల అప్లికేషన్లు
  •     సూర్యాపేట జిల్లాలో 2,094 ... 
  •      అప్లికేషన్లు మరింత పెరిగే అవకాశం

యాదాద్రి, సూర్యాపేట, వెలుగు :  రేషన్​ కార్డుల పంపిణీ విషయంలో గత బీఆర్​ఎస్​ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎన్నికల సమయంలో కార్డులు ఇస్తామని ఆశలు కల్పించి.. ఆ తర్వాత ఉసూరుమన్పించింది. గతేడాది కొలువు తీరిన కాంగ్రెస్​ సర్కారు.. కొత్త రేషన్​ కార్డుల పంపిణీకి కేబినెట్​ఆమోదం తెలిపింది. దీనిపై సబ్​కమిటీని ప్రభుత్వం నియమించింది. దీంతో ఇక కొత్త రేషన్​కార్డులు వస్తాయని ప్రజల్లో ఆశలు చిగురించాయి.  

కార్డులు ఇచ్చింది కొన్నే.. 

పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్​ఎస్​ సర్కారు.. కొత్త రేషన్​ కార్డులు ఇవ్వడంపై దృష్టి పెట్టలేదు. 2018 ముందస్తు ఎన్నికల సమయంలో రేషన్​ కార్డులు ఇస్తామని ప్రకటించి అప్లికేషన్లు ఆహ్వానించింది. దీంతో అప్పట్లో పెద్ద ఎత్తున అప్లికేషన్​ చేసుకున్నారు. అయితే, 2021 నాటికి కొందరికి మాత్రం ఆహార భద్రత కార్డులు మంజూరు చేసింది. ఆ తర్వాత పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. కుటుంబాలు, కుటుంబ సభ్యులు పెరుగుతున్నా.. కార్డులు జారీ చేయలేదు. చనిపోయినవారి పేర్లను జాబితా నుంచి తొలగించారే కానీ కొత్తగా వారిని చేర్చలేదు. దీంతో పలు సంక్షేమ పథకాల విషయంలో అర్హులైన అనేక మందికి లబ్ధి కలగలేదు. 

11,479 మంది లబ్ధిదారుల తొలగింపు..

యాదాద్రి జిల్లాలో 2019లో 2,14,560 రేషన్​ కార్డులు ఉండగా, 6,71,533 లబ్ధిదారులు ఉన్నారు. ప్రస్తుతం 2,16,841 కార్డులకు 6,60,054 మంది  కుటుంబ సభ్యులు  ఉన్నారు. ఈ ఐదేండ్లలో 2,231 కార్డులు ఇచ్చిన బీఆర్​ఎస్​ సర్కారు.. కార్డుల్లోంచి మొత్తంగా 11,479 మంది సభ్యులను తొలగించింది. ప్రస్తుతమున్న రేషన్​కార్డుల్లో కొత్తగా తమను చేర్చాలని కోరుతూ 45 వేల మంది అప్లికేషన్లు చేసుకున్నారు. 

యాదాద్రి జిల్లాలో 11 వేల అప్లికేషన్లు..

యాదాద్రి జిల్లాలోని 17 మండలాల పరిధిలో 515 రేషన్​ షాపులు ఉన్నాయి. ప్రస్తుతం 2,16,841 రేషన్​కార్డులు ఉండగా 6,60,054 మంది లబ్ధిదారులున్నారు. కాగా డిసెంబర్​ 2016 నుంచి ఇప్పటివరకు 11 వేల మంది రేషన్​ కార్డుల కోసం అప్లయ్​ చేసుకున్నారు. అప్లయ్​ చేసుకున్న వారి కుటుంబ సభ్యుల సంఖ్య 28,500 ఉన్నారు. వీటిలో 3,250 అప్లికేషన్లను తిరస్కరించారు.  7,750 అప్లికేషన్లను అప్రూవ్​ చేశారు. మ్యూటేషన్ల కోసం 1700 మంది అప్లయ్​ చేసుకున్నారు. కార్డుల్లో లబ్ధిదారులుగా తమను చేర్చాలని 45 వేల మందికి పైగా అప్లయ్​ చేసుకున్నారు. 

సూర్యాపేట జిల్లాలో 2,094  అప్లికేషన్లు పెండింగ్..

జిల్లాలోని 23 మండలాల పరిధిలో మొత్తం 610 రేషన్‌‌ షాపులు ఉన్నాయి. 3,04,328  ఆహారభద్రత కార్డులు ఉండగా, 8,75,345 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటికే జిల్లాలోని మీసేవా కేంద్రాల్లో 2,094  మంది రేషన్​కార్డు కోసం అప్లికేషన్ చేసుకోగా.. అవి పెండింగ్‌‌లోనే ఉన్నాయి. వీటితోపాటు రేషన్​కార్డుల్లో తమ పేరు చేర్చాలని మరో 15,106 మంది అప్లయ్ చేసుకున్నారు.  రేషన్‌‌కార్డుల పంపిణీ కోసం విధివిధా నాలు రూపొందించి, లాగిన్​కు అవకాశం కల్పిస్తే అప్లికేషన్లు మరిన్ని పెరిగే అవకాశం ఉంది.

రేషన్​ కార్డుల పంపిణీపై సర్కారు దృష్టి..

ప్రజా పాలనలో భాగంగా ప్రజల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 28, 2023 నుంచి జనవరి 6, 2024 మధ్య అప్లికేషన్లను స్వీకరించింది.  అయితే ఆరు గ్యారంటీల కంటే కూడా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో రేషన్ కార్డుల జారీపై కాంగ్రెస్​ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఆరు గ్యారంటీలతోపాటు ఇతర సంక్షేమ పథకాలకు రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకోవడంతో ప్రజల నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలన్న డిమాండ్

పెరగడంతో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులను ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ లో ప్రకటన చేశారు. రేషన్ కార్డుల పంపిణీకి కేబినెట్​ నిర్ణయం తీసుకుంది. విధి విధానాలపై సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకున్నది. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్న వారి నిరీక్షణకు తెరపడనుంది.