- డీపీఆర్ ను ఆమోదించిన రాష్ట్ర మంత్రి వర్గం
- రెండు మూడు రోజుల్లో కేంద్రానికి డీపీఆర్
- సెంట్రల్ ఆమోదం పొందితే... పనులు షురూ
హైదరాబాద్ సిటీ, వెలుగు: మెట్రో సెకండ్ ఫేజ్ కు లైన్ క్లియరయింది. రాష్ట్ర మంత్రివర్గం శనివారం సెకండ్ ఫేజ్ డీపీఆర్(డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) కు ఆమోద ముద్రవేసింది. హైదరాబాద్ మెట్రో ఐదు కారిడార్లు, 24,269 కోట్ల అంచనా వ్యయం, 76.2 కి.మీ, 56 స్టేషన్లతో డీపీఆర్ ను సిద్దం చేసి, రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించగా, ప్రభుత్వం పరిశీలించి ఆమోదం తెలిపింది. మరో రెండు మూడు రోజుల్లో డీపీఆర్ ను కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం డీపీఆర్‌ను ఆమోదిస్తే, కొద్ది నెలల్లోనే మెట్రో సెకండ్ ఫేజ్ పనులు షురూ కానున్నాయి. నాలుగేండ్లలో పాతబస్తీ ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట మార్గంపనులను పూర్తిచేసేలా ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. సెకండ్ ఫేజ్ పనులు పూర్తయితే, మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య మరో 7, 8 లక్షలు పెరిగే అవకాశం ఉంది. సెకండ్ ఫేజ్‌లో ఆరో కారిడార్ ఫోర్త్ సిటీ ముచ్చర్లకు కూడా 40 కి.మీ, 8 వేల కోట్లతో మెట్రో ప్రతిపాదనలు ఉండగా, ప్రస్తుతం దాని డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు.
సెకండ్ ఫేజ్ లోనే ఏయిర్‌పోర్టులో అండర్ గ్రౌండ్ మెట్రో కూడా అందుబాటులోకి రానుంది. ఇది వరకు ఫస్ట్ ఫేజ్ లో 3 కారిడార్ల పరిధిలో 69 కిలో మీటర్ల మేర మెట్రో మార్గం నిర్మాణం జరిగింది. ప్రస్తుతం మూడు కారిడార్ల పరిధిలో రోజూ సగటున 5 లక్షమంది మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు.
మరింత విస్తరించి..
ప్రభుత్వం మెట్రో సెకండ్ ఫేజ్ రూట్లను రెండు, మూడు దఫాలు మార్చింది. సిటీ ప్రజలకు మెట్రో ప్రయాణ అవసరాన్ని గుర్తించి, అవసరమైన రూట్లలో విస్తరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గతప్రతిపాదిత రూట్లను మార్చడంతో పాటు, కొత్త రూట్లను తీసుకురావడం, పాత రూట్లను పొడిగించడం చేసింది. ప్రస్తుతం 116.2 కి.మీలకు ఫేజ్ –2 ను విస్తరించింది. ఇందులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫోర్త్ సిటీ ముచ్చర్ల మెట్రో మార్గం 40 కి.మీ కొత్త కారిడార్‌ను ప్రతిపాదించింది.
రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు ఉన్న రూట్ ను కోకాపేట్ వరకు పొడిగించారు. మైలార్ దేవ్ పల్లి నుంచి పీ7 మార్గంలో ఉన్న ఏయిర్ పోర్టు రూట్ ను ఆరాంఘర్ నుంచి రాజేంద్రనగర్ కొత్త హైకోర్టు మీదుగా ఏయిర్ పోర్టుకు మార్గాన్ని మార్చారు. ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు కొత్త కారిడార్‌ను తీసుకొచ్చారు.
ప్రస్తుతం సెకండ్ ఫేజ్‌లో భాగంగా నాగోల్– శంషాబాద్ 36. 6 కి.మీ, రాయదుర్గం–కోకాపేట్11.6 కి.మీ, ఎంజీబీఎస్– - చాంద్రాయణగుట్ట 7.5 కి.మీ, మియాపూర్- – పటాన్ చెరు 13.4 కి.మీ, ఎల్బీ నగర్ – హయత్ నగర్ 7.1 కి.మీ మొత్తం ఐదు కారిడార్లలో 76.2 కిలోమీటర్ల మేరకు విస్తరణ చేపట్టాలని శనివారం మంత్రి మండలి నిర్ణయించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో మెట్రో ఫేజ్ -2 పనులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంట్లో అంతర్జాతీయ రుణసంస్థలను భాగస్వామ్యం చేయడంతో పాటు ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యం(పీపీపీ) లో పనులు చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా 30 శాతం, కేంద్ర ప్రభుత్వం వాటా 18 శాతం, అంతర్జాతీయ రుణ సంస్థల వాటా 48 శాతం, పీపీపీ పద్ధతిలో 4 శాతం నిధులను సమీకరించి పనులు చేపట్టబోతుంది.
వివిధ రుణ సంస్థల నుంచి సేకరించే రుణాలను తక్కువ వడ్డీకి పొందాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మెట్రో ఫేజ్ 1 పనులను ప్రైవేట్ పబ్లిక్ పార్ట్‌నర్ షిప్ పద్ధతిలో (పీపీపీ) చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఎక్కువ శాతం నిధులను ఎల్అండ్ టీ సంస్థ సమకూర్చింది.
కేంద్రం కరుణించేనా..
గత ప్రభుత్వ హాయంలో ఫేజ్ 2 పనులు ప్రతిపాదనలకే పరిమితం అయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫేజ్- 2 పనుల కోసం దాదాపు రూ. 2 వేల కోట్లు కేటాయించినా.. వాటిని విడుదల చేయలేదు. పుణే, థానే, బెంగుళూరు, చెన్నైలో జరుగుతున్న మెట్రో మలిదశ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే భారీగా నిధులు కేటాయించింది. ఒక్క చెన్నై మెట్రో మలిదశ పనులకు సంబంధించి 63,246 కోట్ల డీపీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఆమోదం తెలిపింది.
దీంతో హైదరాబాద్ మెట్రోకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం, మెట్రో అధికారులు ఆశలు పెట్టుకున్నారు. సీఎం రేవంత్ఇటీవల కేంద్రమంత్రి ఖట్టర్‌ను కలిసిన సందర్భంగా మెట్రో ఫేజ్ 2 పనుల వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. డీపీఆర్‌కు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలపడంతో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక చేరనుంది. కేంద్ర ప్రభుత్వం కరుణిస్తదో, మొండిచేయి చూపిస్తదో వేచి చూడాలి.