- ఎర్రుపాలెం నుంచి నంబూరుకు 57 కి.మీ. ప్రత్యేక మార్గం
- కృష్ణా నదిపై 3.2 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి
- చెన్నై- హైదరాబాద్-కోల్‌కతా సిటీలతో అనుసంధానం
- రూ.2,245 కోట్లతో నాలుగేండ్లలో పూర్తి
- రూ.4,553 కోట్లతో బీహార్‌కు మరో రైల్వే ప్రాజెక్టు
- స్పేస్ రంగంలో స్టార్టప్‌లకు రూ.1000 కోట్లతో క్యాపిటల్ ఫండ్
న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ రాజధాని అమరావతికి కొత్తగా రైల్వేలైన్‌ను కేంద్ర మంత్రివర్గం మంజూరు చేసింది. ఇందుకోసం తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు రూ. 57 కిలోమీటర్ల ప్రత్యేక రైల్వే మార్గం వేయనున్నారు. గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గంలో దీనికి ఆమోదం తెలిపారు. అనంతరం రైల్వే నిలయంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తో కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు.
ఈ మీటింగ్ కు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, లావు శ్రీకృష్ణదేవరాయలు వర్చువల్ గా హాజరయ్యారు. రూ.2,245 కోట్లతో చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా రూట్‌తో అమరావతిని అనుసంధానించేలా ఈ ప్రాజెక్టు రూపొందించినట్టు వైష్ణవ్తెలిపారు. బీహార్ లో రైల్వే కనెక్టివిటినీ మరింత బలోపేతం చేయడం కోసం రూ.4,553 మరో రైల్వే ప్రాజెక్టకు కూడా ఆమోదం తెలిపారు. అలాగే స్పేస్ సెక్టార్లో స్టార్టప్‌ల కోసం రూ.1,000 కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్‌కు ఒకే చెప్పారు.
నాలుగేండ్లలో పూర్తి చేస్తం
మెట్రో నగరాలైన చెన్నై, హైదరాబాద్, కోల్‌కతాతో అమరావతిని అనుసంధానించేలా ఈ రైల్వే లైన్ నిర్మాణం చేపట్టినట్టు వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ లైన్ కోసం విజయవాడ సమీపంలో కొత్తపల్లి–వడ్డమాను గ్రామాల మధ్య కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల బ్రిడ్జి వేయనున్నట్టు తెలిపారు. కొండపల్లి రిజర్వు ఫారెస్టుపై ప్రభావం పడకుండా ఈ లైన్నిర్మిస్తామన్నారు. అలాగే ఈ మార్గంలో మల్టీమోడల్ కార్గో హబ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 25 కోట్ల చెట్లను కూడా నాటనున్నట్టు తెలిపారు.
రెండు లైన్ల కోసం భూసేకరణ జరిగినా రద్దీ అంచనా కోసం తొలుత ఒక లైన్ వేయనున్నట్టు చెప్పారు. ఇందుకోసం ఇప్పటికే డీపీఆర్ రెడీ అయిందన్నారు. డీపీఆర్‌పై టెక్నికల్ క్లారిటీ రాగానే మోదీ, చంద్రబాబు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. నాలుగేండ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు 2014–-19లో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించగా రైల్వే బోర్డు ఆమోదించింది. దానికి ఇప్పుడు ఆమోదిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. అమరాతికి రైల్వేలైన్‌ను కేంద్ర కేబినెట్ ఓకే చేయడంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్, రామ్మోహన్ నాయుడు ప్రధానికి, కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.
బిహార్‌లో రైల్వే నెట్వర్స్ బలోపేతం
బిహార్‌లోని నార్కతియాగంజ్–-రక్సాల్–సీతామర్హి–-దర్భంగా, సీతామర్హి–ముజఫర్‌పూర్ సెక్షన్‌లను 256 కి.మీ మేర డబ్లింగ్ చేయనున్నారు. ‘‘నర్కతియాగంజ్–రక్సాల్–సీతామర్హి-–దర్భంగా, సీతామర్హి–-ముజఫర్‌పూర్ సెక్షన్‌ల డబ్లింగ్ చేయడం వల్ల నేపాల్, ఈశాన్య భారతదేశం, బోర్డర్ ఏరియాలకు కనెక్టివిటీ బలపడుతుంది. గూడ్స్, ప్యాసింజర్ రైళ్ల రాకపోకలను సులువు చేస్తుంది.
దీంతో ఈ ప్రాంతం -ఆర్థికంగా, సామాజికంగా డెలవలప్ అవుతుంది” అని వైష్ణవ్ అన్నారు. ఈ రెండు రైల్వే ప్రాజెక్టులతో వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, బొగ్గు, ఇనుప ఖనిజం, ఉక్కు, సిమెంట్ వంటి సరుకుల రవాణా మెరుగు పడుతుందన్నారు. ఏటా అదనంగా 31 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరగనున్నట్టు చెప్పారు.
అంతరిక్ష రంగం అభివృద్ధికి..
అంతరిక్ష రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు, వాటిలో పెట్టుబడులు పెట్టేందుకు రూ.1000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఫండ్‌తో ఐదేండ్లు కార్యకలాపాలు కొనసాగించేలా ప్రణాళికలు రూపొందించనున్నారు. ఇందుకు సగటున ఏటా రూ.150- 250 కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం. స్పేస్ రిఫామ్స్, స్పేస్ యాక్టివిటీస్‌లో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం కోసం 2020లో కేంద్ర ప్రభుత్వం ఇన్–స్పేస్‌ను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే ప్రస్తుతం రూ.1,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను ఇన్- స్పేస్ ప్రతిపాదించింది. దీనికి కేబినెట్ ఆమోదించింది.