సీఎం అమెరికా టూర్ తర్వాత కేబినెట్​ విస్తరణ

సీఎం అమెరికా టూర్ తర్వాత కేబినెట్​ విస్తరణ
  • పీసీసీ చీఫ్, మిగతా కార్పొరేషన్ పోస్టుల భర్తీ కూడా..
  • ఆషాఢమాసం ముగియడంతో పదవులపై నేతల ఆశలు
  • ఢిల్లీలో ఆశావహుల చక్కర్లు

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగిశాక రాష్ట్ర కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్​ నియామకం ఉండే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి హైకమాండ్ నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చినట్టు పీసీసీ నేతలు చెప్తున్నారు. ఈ నెల 14న సీఎం రేవంత్ హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆ వెంటనే ఆయన ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అగ్ర నేతలతో చర్చించి, కేబినెట్ బెర్త్​లను ఖాయం చేయనున్నట్టు చర్చ నడుస్తున్నది.  

మొత్తం 18 మంది ఉండాల్సిన కేబినెట్​లో ప్రస్తుతం సీఎంను కలుపుకొని 12 మంది ఉన్నారు. ఇంకా ఆరుగురిని కేబినెట్​లోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి నలుగురిని తీసుకొని, మరో రెండు బెర్త్ లు ఖాళీగా ఉంచుతారనే ప్రచారం జరుగుతున్నది. భర్తీ చేయనున్న ఆ నాలుగింటిలో  మంత్రి మండలిలో ప్రాతినిధ్యం లేని జిల్లాలతోపాటు సామాజిక సమీకరణలు కీలకంగా మారనున్నాయి.


ఇప్పటి వరకు ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలకు మంత్రి మండలిలో ప్రాతినిధ్యం లేదు. ఇదే సమయంలో ముదిరాజ్​లు, లంబాడీలు, మైనార్టీ సామాజిక వర్గాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది. ముదిరాజ్ లకు కేబినెట్ లో అవకాశం ఇస్తామని లోక్ సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 

పీసీసీ చీఫ్​, కార్పొరేషన్​ పదవులు కూడా..

మంత్రి మండలి విస్తరణ పూర్తికాగానే పీసీసీ చీఫ్ ను కూడా నియమిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. పీసీసీ చీఫ్ పదవిని బీసీ లేదా ఎస్సీ, ఎస్టీలలో ఒకరికి ఇస్తారనే ప్రచారం సాగుతున్నది. ఇక మరో 20 నుంచి 25 కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీ కూడా త్వరలోనే ఉండనుందని పీసీసీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే 35 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించిన సీఎం రేవంత్ రెడ్డి, మరో 25  వరకు వివిధ కార్పొరేషన్ల పదవుల భర్తీకి రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. 

ఇందులో ఆర్టీసీ, సివిల్ సప్లైలాంటి కీలక పోస్టులు ఉండనున్నాయి. మొత్తానికి ఆషాఢమాసం ముగిసి, శ్రావణ మాసం ప్రారంభం కానుండడంతో కాంగ్రెస్ లో  చాలా మంది సీనియర్లకు పదవుల పండగ రానుంది. ఏదో ఒక పదవి దక్కించుకునేందుకు రాష్ట్ర నేతలు పలువురు ఢిల్లీలో ఏఐసీసీ నేతల చుట్టూ చక్కర్లుకొడుతున్నారు.