
- అసెంబ్లీ ముగియడంతో హస్తినలో సీనియర్ల మకాం
- ఇప్పటికే ఢిల్లీలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
- నేడు బయల్దేరనున్న భట్టి విక్రమార్క
- అదృష్టం ఎవరిని వరిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ
హైదరాబాద్, వెలుగు: మంత్రివర్గ విస్తరణ ఖాయమని తేలిపోవడంతో ఆశావహులైన పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ బాట పట్టారు. అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో కేబినెట్ లో బెర్త్ ఖరారు చేసుకునేందుకు ఎమ్మెల్యేలు గురువారం మధ్యాహ్నం నుంచే దేశ రాజధానికి క్యూ కట్టారు. మంత్రిపదవులు ఆశిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, దొంతి మాధవరెడ్డి, పలువురు లంబాడీ ఎమ్మెల్యేలు, మాదిగ ఎమ్మెల్యేలు హస్తిన విమానం ఎక్కారు.
త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం సాగడంతో ఈసారైనా మంత్రిపదవిని ఖాయం చేసుకోవాలనే పట్టుదలతో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా శుక్రవారం ఉదయం ఢిల్లీ వెళ్తున్నారు. ఏఐసీసీ ముసాయిదాపై జరగున్న సమావేశంలో పాల్గొననున్న భట్టి.. తర్వాత అందుబాటులో ఉన్న జాతీయ నేతలను కలవనున్నారు. మంత్రివర్గంలో తన వారి కోసం ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఇక పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. డీసీసీ అధ్యక్షుల సమావేశం సాగుతుండడంతో ఆయన అందులో పాల్గొన్నారు. శుక్రవారం కూడా ఆయన అక్కడే ఉండి పీసీసీ కార్యవర్గం కూర్పు, నామినేటెడ్ పదవుల భర్తీపై జాతీయ నేతలతో చర్చించనున్నారు. మంత్రివర్గంలో బీసీల ప్రాతినిథ్యం పెంచుకునేందుకు పార్టీ అధ్యక్షునిగా మహేశ్ గౌడ్ తన వంతు ప్రయత్నాలను తీవ్రం చేశారు.
రాష్ట్రం నుంచి దేశ రాజధానికి రాజకీయాలు
ఇప్పుడు రాష్ట్ర నేతలు ఢిల్లీలో మకాం వేయడంతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు దేశ రాజధానికి మారినట్లయింది. మంత్రివర్గంలో ఆరు బెర్తులు ఖాళీగా ఉండడం, అందులో వీలును బట్టి నాలుగు నుంచి ఐదు భర్తీ చేయనుండడంతో అందులో ఒక్క బెర్తును దక్కించుకునేందుకు సీనియర్ ఎమ్మెల్యేలు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు.
ఇదే సమయంలో ఢిల్లీలోని కాంగ్రెస్ జాతీయ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుల సమావేశం జరుగుతుండడం, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పలువురు డీసీసీ అధ్యక్షులు హాజరై తమ పరిధిలోని రాజకీయ పరిస్థితులను పార్టీ ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ కు వివరిస్తుండడంతో రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలకు ఇప్పుడు ఢిల్లీ వేదికైంది.
గురువారం వరకు అందరి దృష్టి అసెంబ్లీ సమావేశాలపై ఉండగా, ఇప్పుడు ఆ సమావేశాలు ముగియడంతో శుక్రవారం నుంచి మంత్రివర్గ విస్తరణపై ఇటు కాంగ్రెస్ లో అటు రాష్ట్ర రాజకీయాల్లో వాడివేడిగా చర్చ సాగనుంది. ఆరింటిలో ఎన్ని బెర్త్ లను భర్తీ చేయనున్నారు, ఎవరెవరిని అదృష్టం వరించనుందనే చర్చ సాగుతున్నది.