త్వరలో మంత్రివర్గ విస్తరణ.. నాలుగు పదవుల భర్తీకి​ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్!

త్వరలో మంత్రివర్గ విస్తరణ.. నాలుగు పదవుల భర్తీకి​ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్!
  • గ్రీన్ సిగ్నల్!
  •  బీసీ(ముదిరాజ్​), ఎస్సీ, రెడ్డి, మైనార్టీ వర్గాలకు చాన్స్​
  • సీఎం రేవంత్​, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్​, పీసీసీ చీఫ్ మహేశ్​తో చర్చించిన వేణుగోపాల్
  • ఢిల్లీలో నలుగురితో విడివిడిగా భేటీ.. పలువురి పేర్లు ప్రస్తావన
  • ప్రస్తుతం 6 మంత్రి పదవులు ఖాళీ నాలుగింటికి ఓకే.. రెండు పెండింగ్​

న్యూఢిల్లీ, వెలుగు: దాదాపు ఏడాది కాలంగా పెండింగ్​లో ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్​ హైకమాండ్​ ఓకే చెప్పినట్లు తెలిసింది. త్వరలోనే పదవులు భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మంత్రివర్గంలో 18 మంత్రి పదవులు (సీఎంతో కలిపి) ఉండగా.. ప్రస్తుతం 12 మంది ఉన్నారు. ఖాళీగా ఉన్న ఆరు పోస్టుల్లో నాలుగింటికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వీటిని బీసీ (ముదిరాజ్), ఎస్సీ, రెడ్డి, మైనార్టీ వర్గాలకు కేటాయించాలని డిసైడ్​ అయినట్లు తెలిసింది. శుక్రవారం పార్లమెంట్​లో కాంగ్రెస్​ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్​తో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్  విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురి పేర్లను నేతలు ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే గురువారం రాత్రి జరిగిన భేటీలోనూ ఇదే అంశంపై దాదాపు 2 గంటల పాటు చర్చించారు. ఇందులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో.. శుక్రవారం మరోసారి కేసీ వేణుగోపాల్​ సమావేశమయ్యారు. వన్ టు వన్ మీటింగ్ లో తొలుత మంత్రి ఉత్తమ్, తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అనంతరం పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​, చివర్లో సీఎం రేవంత్​రెడ్డితో ఆయన చర్చించారు. వారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. 

సందర్భాన్ని బట్టి మరో రెండు!

ప్రస్తుతం నాలుగు మంత్రి పదవులు భర్తీ చేయాలని కాంగ్రెస్​ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మిగిలిన రెండు స్థానాల్ని మాత్రం సందర్భానికి తగ్గట్టు భర్తీ చేయాలని డిసైడ్ అయింది. త్వరలో భర్తీ చేయనున్న నాలుగు మంత్రి పదవుల్లో ఎస్సీ, బీసీ, రెడ్డి, మైనార్టీ సామాజికవర్గాలకు అవకాశం కల్పించే చాన్స్ ఉంది. ఈ దిశలో ఆయా సామాజికవర్గాల నుంచి రాష్ట్ర నేతలు సూచించిన పలువురి పేర్లను పరిశీలనలోకి తీసుకుంది. ఐదో పదవి గురించి కూడా చర్చ జరుగుతున్నది.  దీన్ని వెలమ వర్గానికి చాన్స్​ ఇవ్వొచ్చన్న ప్రచారం నడుస్తున్నది.