
- గవర్నర్‌కు తెలియజేసిన సీఎం రేవంత్ రెడ్డి
- అసెంబ్లీలో పాస్ చేసిన బిల్లులకు తొందరగా ఆమోదం తెలపాలని రిక్వెస్ట్
- బీసీ బిల్లులు రాష్ట్రపతి కన్సెంట్ కు పంపాల్సి ఉందని వెల్లడి
- వర్గీకరణ బిల్లును ఆమోదిస్తే జాబ్ నోటిఫికేషన్లు వేస్తామన్న సీఎం
- అసెంబ్లీ సెషన్స్ జరిగిన తీరుపైనా వివరణ
- రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో గంటన్నర భేటీ
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాల్లో పాస్ అయిన బిల్లులకు ఆమోదం తెలపాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మనుసీఎం రేవంత్‌రెడ్డి కోరారు. వారంలోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, ఏఐసీసీ జాబితా రాగానే ముహూర్తం ఫిక్స్ చేస్తామని ఆయనకు తెలియజేసినట్టు సమాచారం. రాజ్‌భవన్‌లో శనివారమే ఉగాది వేడుకలను గవర్నర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డిని గవర్నర్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయితే, అదే రోజు సీఎం కొడంగల్ పర్యటనలో ఉండడంతో.. హాజరు కాలేదు. దీంతో ఆదివారం రవీంద్ర భారతిలో ప్రభుత్వ పంచాంగ శ్రవణ కార్యక్రమం ముగించుకుని సీఎం రేవంత్ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ , రేవంత్‌రెడ్డి పరస్పరం తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
దాదాపు గంటన్నర పాటు సమావేశమై వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఈ నాలుగైదు రోజుల్లోపే నలుగురు లేదా ఆరుగురు మంత్రివర్గంలో చేరనున్నారనే సమాచారాన్ని గవర్నర్ తో సీఎం ప్రస్తావించినట్టు తెలిసింది. ఏఐసీసీ నుంచి పేర్లు రాగానే రాజ్‌భవన్ వేదికగా ప్రమాణ స్వీకారం నిర్వహించే ముహూర్తం ఖరారు కానున్నదనే అంశాలను వివరించినట్టు సమాచారం.
బిల్లులపై ప్రత్యేక చర్చ
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందిన బిల్లులపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా చర్చించారు. వీలైనంత తొందరగా బిల్లులకు ఆమోద ముద్ర వేయాలని కోరినట్టు తెలిసింది. మొత్తం 11 రోజులపాటు జరిగిన అసెంబ్లీ సెషన్‌లో కొత్తగా 12 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టగా.. సుదీర్ఘ చర్చల అనంతరం సభ్యులు వాటికి ఆమోదం తెలిపారు. ఇందులో విద్యా, ఉద్యోగ రంగాల్లో, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం, దళిత కులాలు, ఉప కులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ ఎస్సీ వర్గీకరణ బిల్లు సహా మొత్తం 12 బిల్లులు ఉన్నాయి.
ఇందులో రెండు బీసీ బిల్లులను రాష్ట్రపతి కన్సెంట్ కోసం వీలైనంత తొందరగా పంపాలని గవర్నర్ దృష్టికి తెచ్చినట్టు సమాచారం. పార్లమెంట్ సమావేశాలు వచ్చే నెల మూడో తేదీన ముగియనుండడంతో ఆ లోపే పంపాలని, అఖిలపక్షంతో కలిసి రాష్ట్రపతి, ప్రధాని, ఇతర కేంద్ర మంత్రులను బీసీ బిల్లుల ఆమోదం కోసం కలువనున్నట్టు వివరించారు. ఇక ఎస్సీ వర్గీకరణ బిల్లును సైతం త్వరగా ఆమోదించాలని గవర్నర్ ను సీఎం రిక్వెస్ట్ చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసిన రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ ఫస్ట్ ఉంటుందని వివరించారు.
అదే సమయంలో ఎస్సీ వర్గీకరణ కోసం గత 6 నెలలుగా ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్ మెంట్ ఆపేశామని, ఈ బిల్లుకు రాజముద్ర లభిస్తే వచ్చే నెల నుంచే కొత్త నోటిఫికేషన్లు ఇచ్చుకునేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. వీటితోపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగిన విధానం, ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన, ఒక సభ్యుడిని సస్పెండ్ చేయడం, డీలిమిటేషన్ సహా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 తీర్మానాల ప్రతిపాదనలపై చర్చ అనంతరం ఆమోదం పొందడం, బడ్జెట్‌పై చర్చలు.. వీటన్నింటినీ గవర్నర్‌కు సీఎం వివరించారు. సీఎం వెంట మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.