కొత్తగూడెం కార్పొరేషన్​కు ఓకే

కొత్తగూడెం కార్పొరేషన్​కు ఓకే
  • ఏర్పాటుకు క్యాబినెట్​లో ఆమోదం 
  • ఎన్నికల హామీ నెరవేర్చిన మంత్రి తుమ్మల 
  • కొత్తగూడెం అభివృద్ధిలో ఇది కీలక అడుగు అని ఎమ్మెల్యే వెల్లడి 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు  : కొత్తగూడెం కార్పొరేషన్​కు క్యాబినెట్​ఒకే చెప్పింది. శనివారం జరిగిన క్యాబినెట్​ మీటింగ్​లో కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్​ మండలంలోని ప్లేన్​ ఏరియాలుగా ఉన్న సుజాతనగర్, నర్సింహ సాగర్​, కొమిటిపల్లి, నిమ్మలగూడెం, లక్ష్మీదేవిపల్లి, మంగపేట పంచాయతీలను కలుపుతూ కొత్తగూడెం కార్పొరేషన్​ ఏర్పాటు చేసేందుకు ఆమోదం లభించింది. అసెంబ్లీ, పార్లమెంట్​ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను మంత్రి తుమ్మల నెరవేర్చారు. ఎమ్మెల్యే కూనంనేని పట్టుబట్టి సాధించారు. 

మొదట ఇలా..

కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లోని పలు గ్రామాలను కలుపుతూ కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్​ ఏర్పాటు చేసేందుకు మొదటగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు ఆఫీసర్లు ప్లాన్ చేశారు. కాగా లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలంలోని గ్రామాలు ఏజెన్సీలో ఉండడంతో ఏజెన్సీ చట్టాలు అడ్డం అయ్యే అవకాశం ఉందని గుర్తించారు. ఎవరైనా కోర్టుకు వెళ్తే కార్పొరేషన్​ ఏర్పాటులో జాప్యం జరుగుతుందని ఉన్నతాధికారులు ఎమ్మెల్యేతో పాటు ఆఫీసర్లకు సూచించారు. 

దీంతో ప్లాన్​మార్చారు. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్​లోని ఏడు పంచాయతీలతో కార్పొరేషన్​ ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ఆఫీసర్లతో పాటు ఎమ్మెల్యే ఇటీవల ప్రతిపాదనలు పంపారు. దీంతో కార్పొరేషన్​ ఏర్పాటుకు మార్గం ఏర్పడింది. 

పట్టుబట్టారు.. హామీ నెరవేర్చారు..

కొత్తగూడెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్​ మద్దతుతో సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలను కలుపుతూ కార్పొరేషన్​ ఏర్పాటు చేస్తామని తుమ్మల నాగేశ్వరావుతో పాటు ఎమ్మెల్యే కూనంనేని ప్రజలకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా సాంబశివరావును భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించారు.

ALSO READ : ఏడాది పాలనలో ఆర్టీసీ కొంత పుంతలు: ఫ్రీ జర్నీపై రూ.4,225 కోట్లు ఖర్చు

 అనంతరం జరిగిన పార్లమెంట్​ఎన్నికల్లోనూ కార్పొరేషన్​ ఏర్పాటుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కూనంనేని హామీ ఇప్పించారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్​అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి ప్రజల పట్టం కట్టారు. అప్పటి నుంచి కార్పొరేషన్​ఏర్పాటుపై సీఎం, డిప్యూటీ సీఎం, జిల్లా ఇన్​చార్జి మంత్రితో పాటు మంత్రులు తుమ్మల, పొంగులేటి ఫోకస్​ పెట్టారు. ఎట్టకేలకు కార్పొరేషన్​ సాధించారు. 

పాల్వంచకు ఎన్నికల కల..

దాదాపు 25 ఏండ్లుగా పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడం లేదు. పలు రకాల కేసులతో మున్సిపాలిటీలో ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించడం లేదు. కార్పొరేషన్​ ఏర్పాటుతో పాల్వంచ మున్సిపల్​ ప్రజలు ఎన్నికల్లో పాల్గొననున్నారు.  

ఎమ్మెల్యే హర్షం.. 

కొత్తగూడెం కార్పొరేషన్​ ఏర్పాటుకు క్యాబినెట్​ఒకే చెప్పడంపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేషన్​ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన సీనియర్​ ఐఏఎస్​ ఆఫీసర్లు దాన కిషోర్, గౌతమ్​, శ్రీదేవి, కలెక్టర్​ జితేశ్​వి పాటిల్, ఆర్డీవో మధుకు ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేషన్​ ఏర్పాటుతో కొత్తగూడెం, పాల్వంచతో పాటు సుజాతనగర్​ అభివృద్ధిలో పరుగు పెడుతుందన్నారు.