ఇవాళ (మార్చి 6) కేబినెట్ భేటీ.. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు ఆమోదం

ఇవాళ (మార్చి 6) కేబినెట్ భేటీ.. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులకు ఆమోదం

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌‌రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటేరియెట్‌‌లో కేబినెట్ మీటింగ్ జరగనుంది. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెస్తున్న రెండు బిల్లులు సహా ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే టూరిజం పాలసీ, రెండోసారి సర్వే చేపట్టిన నేపథ్యంలో కులగణన పూర్తి నివేదికపై చర్చించనుంది. 

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కేబినెట్‌‌లో నిర్ణయం తీసుకోనున్నారు. ఇటీవల సీఎం రేవంత్‌‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులపై చర్చించారు. వాటిపై కూడా కేబినెట్‌‌లో వివరించే అవకాశం ఉంది. రేషన్ కార్డుల పంపిణీ, యాదగిరిగుట్ట ఆలయ  బోర్డు ఏర్పాటు, హెచ్‌‌ఎండీఏ మాదిరి ఫ్యూచర్​సిటీ డెవలప్‌‌మెంట్ అథారిటీ ఏర్పాటుకు కేబినెట్‌‌లో నిర్ణయం తీసుకోనున్నారు. భూభారతి రూల్స్, పెంచిన లిక్కర్​రేట్లు, ఎల్ఆర్ఎస్, ఎస్ఎల్బీసీ ఘటన, మహిళలకు అందిస్తున్న పథకాలు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు తదితర అంశాలపై చర్చించనున్నారు.